టెలికాం పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం
ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
పథకానికి అయిదేళ్లలో రూ.12,195 కోట్ల కేటాయింపు
‘ఆత్మనిర్భర్ భారత్’ కింద ఎంఎస్‌ఎంఇలకు ప్రోత్సాహం
ఏప్రిల్ 1నుంచి పిఎల్‌ఐ అమలు
న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే 5జి టెక్నాలజీని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన కీలకమైన టెలికాం గేర్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం రూ.12,195 కోట్ల ఉత్పత్తితో ముడిపడిన ప్రోతాహక పథకం (పిఎల్‌ఐ)కి ఆమోదం తెలిపింది. ఈ ప్రోత్సాహక పథకంతో మన దేశం ఈ పరికరం ఉత్పత్తిలో ప్రపంచంలోనే బలమైన శక్తిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం 2021 ఏప్రిల్‌నుంచి అమలులోకి వస్తుంది. దీనివల్ల రాబోయే అయిదేళ్లలో రూ.2.4 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుంది. దీనిలో ఒక్క ఎగుమతులే దాదాపు రూ.2 లక్షల కోట్ల మేరకు ఉంటాయని అంచనా. అంతేకాకుండా ఈ పథకం వల్ల రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు రావడమే కాకుండా భారీ ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, అలాగే పన్నులద్వారా ఆదాయం వస్తుందని ఒక అధికార ప్రకటన తెలిపింది. బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరిస్తూ, ప్రభుత్వం మన దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా నిలపాలని యోచిస్తోందని, అందుకోసం ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనువైన వాతావరణాన్ని కల్పించిందని చెప్పారు. ‘టెలిం రంగంలో ‘ మేక్ ఇన్ ఇండియా’ మరింత పురోగతి సాధించడం కోసం ప్రభుత్వం టెలికాం రంగానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం( పిఐఎల్)ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలో 5 జి కూడా వస్తోంది. అందువల్ల ఈ రంగానికి పోత్సాహకాలు ఇవ్వడం ముఖ్యం. దీనికి సంబంధించి ఈ రంగంలోని ఇతర భాగస్వాములతో ప్రభుత్వం విస్తృత చర్చలు జరిపింది’ అని ప్రసాద్ తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్’లో చిన్న, సన్నకారు, మధ్యతరహా పారిశ్రామికవేత్తలను(ఎంఎస్‌ఎంఇ)లను పోత్సహించడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఈపథకం వల్ల రూ.50,000 కోట్ల విలువైన టెలికాం పరికరాలను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా చేయడమే కాకుండా దేశీయ మార్కెట్లకే కాకుండా ఎగుమతులకు ‘ మేడ్ ఇన్ ఇండియా’ పరికరాలను వాటి స్థానంలో తీసుకు వస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.ఈ పథకానికి రాబోయే అయిదేళ్లలో రూ.12,195 కోట్లను కేటాయిస్తారు. ఏటా కనీస ఉత్పత్తి ప్రమాణాలు సాధించడంతో పాటుగా క్రమంగా పెట్టుబడి పెంచడంతో పాటుగా తయారైన వస్తువుల అమ్మకాల్లో పురోగతి ఆధారంగా ఈ ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. వివిధ కేటగిరీలకు, సంవత్సరాలకు 4నుంచి 7 శాతం దాకా ఈ ప్రోత్సాహం ఉంటుంది. కనీస పెట్టుబడి ఎంఎస్‌ఎంఇలకు రూ.10 కోట్లు, ఇతరులకు రూ.100 కోట్లుగా ఉంటుంది. కాగా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ పిసిల తయారీని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం త్వరలోనే లాంటి ఒక పిఐఎల్ పథకాన్ని ప్రకటిస్తుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
జువనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు
జిల్లా మేజిస్ట్రేట్ల కలెక్టర్లు), అదనపు జిల్లా మేజిస్ట్రేట్ల పాత్రను పెంచుతూ జవనైల్ జస్టిస్ చట్టం 2015కు తీసుకు రాదలచిన సవరణలకు కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ విలేఖరులకు తెలియజేశారు. ఈ సవరణల వల్ల ప్రతి జిల్లాలోను జిల్లా మేజిస్ట్రేట్లు, ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్లకు ఈ చట్టాన్ని అమలు చేసే ఏజన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారాలు లభిస్తాయని ఆమె చెప్పారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం కూడా జిల్లా మేజిస్ట్రేట్ కింద పని చేస్తుందని ఆమె చెప్పారు. బాలల సంరక్షణ కమిటీలలో సభ్యులయ్యే వారి గత చరిత్ర (బ్యాక్‌గ్రౌండ్)ను చెక్ చేసేందుకు నిర్దిష్టమైన ఆదేశం ఇప్పటివరకు చట్టంలో లేదని, అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సవరణల ప్రకారం ఇలా సభ్యులయ్యే వారి గత చరిత్ర, వారి విద్యార్హతలు లాంటి వాటినిపైన కూడా తనిఖీలు ఉంటాయని మంత్రి చెప్పారు. అలాగే ఇప్పటివరకు బాలల సంరక్షణ కేంద్రాన్ని నడపాలనుకునే ఏ సంస్థ అయినా దాని ఉద్దేశాలను రాష్ట్రప్రభుత్వానికి అందజేయాల్సి ఉండేది. అయితే తాజా సవరణల ప్రకారం ఏదయినా చైల్డ్ కేర్ సెంటర్ రిజిస్ట్రేషన్‌కు ముందు జిల్లా మేజిస్ట్రేట్ ఆ సంస్థ సామర్థం, గత చరిత్రపై తనిఖీ నిర్వహించి రాష్ట్రప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పిస్తారని స్మృతి ఇరానీ చెప్పారు. ప్రస్తుత చట్ంటలో మూడు కేటగిరీల నేరాలు(చిన్న, తీవ్రమైన, దారుణమైన) ఉన్నాయి. కొత్తగా తీవ్రమైన నేరాలకు ఏడేళ్లకు పైగా శిక్ష విధించడానికి వీలుండే మరో కేటగిరీని కూడా చట్టంలో చేరుస్తారు.