Monday, November 25, 2024

నదులు లింక్ పై అడుగులు

- Advertisement -
- Advertisement -

మహానది -కావేరి అనుసంధానం
360టిఎంసిల నీటి తరలింపుపై నివేదిక
రూ.55వేల కోట్లతో ప్రాధమిక అంచనా
తెలంగాణలో 3.10లక్షల ఎకరాలకు సాగునీరు
18న ఢిల్లీలో కీలక భేటీ

Centre to letter Telangana over Connection of rivers

మనతెలంగాణ/హైదరాబాద్: నదుల అనుసంధానంపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. మహానది-కావేరి నదుల అను సంధానం ప్రతిపాదనలను రాష్ట్రానికి పంపింది. ఈ కొత్త ప్రతిపానదల పట్ల అభిప్రాయాలను తెలపాల్సిందిగా జాతీయ జలవనరుల అభివృద్ది సంస్థ రాష్ట్రానికి లేఖ రాసింది. ఈ కొత్త ప్రతిపాదనలో చత్తస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహించే మహానదిలో 360 టిఎంసిల మిగులు జలాలు ఉన్నట్టు లెక్కతేల్చింది. ఈ నీటిని గోదావరి-కృష్ణా-పెన్నా నదుల మీదుగా కావేరి బేసిన్‌కు తరలించాలని ప్రతిపాదనలు రూపొందించింది. దక్షిణాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం మహానది-కావేరి నదుల అనుసంధానం పధకానికి రూ.55వేలకోట్లు వ్యయమవుతాయిని ప్రాధమిక అంచనా వేసింది. ఈ పధకం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్తగా సుమారు 30లక్షల ఎకరాలకు సాగునీరందించటంతోపాటు వేలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించ వచ్చని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్యుడిఎ) వెల్లడించింది. ఈ పధకం కార్యరూపం దాలిస్తే వచ్చే ఉపయోగాలను వివరిస్తూ ఈ పధకం వల్ల లబ్దిపొందనున్న రాష్ట్రాలకు మహానది-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల నివేదికను పంపింది. అంతే కాకుండా ఈ కొత్త పధకం పట్ల అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కోరింది. మహానది నుంచి 360 టిఎంసిల మిగులు జలాలను గోదావరి నదిలోకి తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల పధకాల ద్వారా కృష్ణానదికి చేర్చనున్నారు. కృష్ణానది నుంచి పెన్నానది, కండలేరు నదుల ద్వారా నేరుగా కావేరి నదీ పరివాహక ప్రాంతానికి అందచేయనున్నారు. ఈ పధకం కార్యరూపంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 8లక్షల ఎకరాలకు మహానది జలాలు అందనున్నట్టు నివేదికలో స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కూడా 10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుంది. అంతే కాకుండా సుమారు నాలుగు వేల గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీరతాయని తెలిపింది. వేసవిలో తాగునీటికి కటకటలాడే చెన్నై మహానగరానికి కూడా మహానది జలాలతో దాహం తీరే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పధకానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను తెలపాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్రానికి లేఖ రాసింది.
నదుల అనుసంధానంపై మేధోమధనం
దక్షిణాది రాష్ట్రాల్లో నదుల అనుసంధానంపైన, ప్రత్యేకించి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధాన పధకం పట్ల తెలంగాణ సర్కారు లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ పధకం ప్రతిపాదనలపై ఇప్పటికే నీటిపారుదల రంగానికి చెందిన నిపుణలతో చర్చిస్తోంది. ఈ పధకం వల్ల రాష్ట్రానికి లాభమా, నష్టమా అన్నదిశగా అధ్యయనం చేస్తున్నారు.గతంలో కేంద్రప్రభుత్వం నదుల అనుసంధానం విషయంలో తెచ్చిన పధకం వల్ల రాష్ట్రం నష్టపోయే అవకాశాలే ఎక్కవగా ఉన్నట్టు నిపుణులు తెల్చిచెప్పారు. గోదావరి-కావేరి నదుల అనసంధానం ద్వారా 274 టిఎంసిల గోదావరి జలాలను కావేరినది పరివాహక ప్రాంతానికి తరలించాలని, అందుకు రూ.45వేల కోట్లు ప్రాధమిక వ్యయపు అంచనాలతో కేంద్రం నివేదిక రూపొందించి రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. కేంద్రం పంపిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలను టిఆర్‌ఎస్ సర్కారు వ్యతిరేకించింది. గోదావరి నదిలో మిగులు జాలాలు లేవని స్పష్టం చేసింది. గోదావరి జలాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి, తాగునీటి పధకాలను ఉదహరించింది. గోదావరి జలాలతో రాష్ట్ర అవసరాలే అధికంగా ఉన్నట్టు తెలిపింది. దీంతో కేంద్రం గోదావరి-కావేరి పధకం ప్రతిపాదనల్లో మార్పులు చేసింది.

ఈ సారి మహానదిలో మిగులు జలాలు చూపిస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి పధకం ద్వారా తెలంగాణకు కూడా ఉపయోగాలు ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పుడు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థనుంచి అందిన ఈ ప్రతిపాదనలపై ఏ విధంగా స్పందించాలన్నదానిపైనే చర్చ జరుగుతోంది. కేంద్రం చెప్పినట్టుగా రాష్ట్రానికి ఉపయగాలు ఉంటాయా, ఉంటే అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఏవిధంగా మేలు చేకూర్చుతాయి అన్నదిశగా నీటిపారుదల రంగం నిపుణులు మేధోమధనం చేస్తున్నారు. ఈ అంశంపై ఈ నెల 18న జరిగే సమావేశంలోపు ఎదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

Centre to letter Telangana over Connection of rivers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News