Sunday, November 17, 2024

టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం

- Advertisement -
- Advertisement -

Centre to Provide free Vaccination from June 21: PM Modi

 

ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం
రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా
ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు
నవంబర్ నాటికి 80శాతం జనాభాకు వ్యాక్సినేషన్
ఇప్పటికే 23 కోట్ల మందికి టీకా అందించాం
ఆక్సిజన్ ఉత్పత్తి ఊహించని రీతిలో 10 రెట్లు పెంచాం
చిన్నారులకు టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి
దీపావళి వరకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రకటనలు

న్యూఢిల్లీ: దేశంలో 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికి ఉచితంగా టీకాలు అందిస్తామని, ఈ భారం ఈ బాధ్యత అంతా కేంద్రం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం సమగ్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, 18 పై బడ్డ వారికి ఉచిత టీకాలను ఈ నెల 21వ తేదీ నుంచి వేసే కార్యక్రమం చేపడుతారని, ఇందుకు అవసరం అయిన ఉచిత వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు అందించడం జరుగుతుందని ప్రధాని మోడీ సోమవారం జాతి నుద్ధేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. రాబోయే రోజులలో వ్యాక్సిన్‌ల సరఫరాను పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 75 శాతం టీకాలను కేంద్రం వ్యాక్సిన్ తయారీదార్ల నుంచి కొనుగోళ్ల ద్వారా సమీకరించుకుని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రాలపై టీకాల భారం పడకుండా చూసామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రాలు ఈ విషయంలో కంగారు పడవద్దని అత్యధిక టీకాలు కేంద్రం నుంచి ఉచితంగా అందుతాయని వివరించారు. ఇక ఈ నెల 21 నుంచి 18 ప్లస్‌లకు టీకాల గురించి రాష్ట్రాలు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవచ్చునని తెలిపారు. 75 శాతం టీకాలు కేంద్రం ఉత్పత్తిదార్ల నుంచి తీసుకుంటుంది. ఇందులో పాతిక శాతం రాష్ట్రాలవారి కోటా కూడా ఉంటుందని, ఈ మొత్తం టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక ప్రైవేటు రంగ ఆసుపత్రులు ఇప్పటిలాగానే మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లను సేకరించుకుంటాయని, అయితే వాటి సేవా రుసుం డోస్‌కు రూ 150గా ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో కరోనా తీవ్రత కట్టడికి అత్యవసరంగా వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సి ఉంది.

దీనిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం చేపట్టే చర్యల గురించి లాక్‌డౌన్‌లు వివిధ రాష్ట్రాలలో ఇప్పుడు లాక్‌డౌన్లు, అన్‌లాక్ ప్రక్రియల సంధి దశలో చేపట్టిన చర్యల గురించి ప్రధాని తమ ఆకస్మిక జాతి ప్రసంగంలో తెలిపారు. రాష్ట్రాలు అనేక విధాలుగా పరిస్థితులను సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా కట్టడి ఇదే దశలో నిబంధనలలో సడలింపుల గురించి ఆలోచిస్తున్నాయని ప్రధాని తెలిపారు. అన్నింటికి మించి ప్రజలకు వ్యాక్సిన్ రక్షా కవచంగా ఉందని, వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్ బంధనాన్ని విస్తృతపర్చే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దేశంలో పలు ఇతర వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఏడు కంపెనీలు ఈ దిశలో వివిధ వ్యాక్సిన్లను తయారుచేస్తున్నాయి.

ఇక మరో మూడు వ్యాక్సిన్లకు సంబంధించి పరీక్షలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఇవి ఎప్పుడైనా అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. వివిధ రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరత తీవ్రస్థాయిలో ఉందని, ప్రైవేటు హాస్పిటల్స్ టీకా సిండికేట్లను ఏర్పాటు చేసుకుని భారీ స్థాయిలో టీకా కోటాలను పొంది, వాటితో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చిన దశలో ప్రధాని వ్యాక్సిన్ల లభ్యత, రాష్ట్రాలకు ఉచిత టీకాలపై భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. నవంబర్ చివరినాటికి దేశవ్యాప్తంగా 80 శాతం మందికి టీకాలు వేసేందుకు రంగం సిద్ధం అయినట్లు ప్రధాని తెలిపారు.

విదేశీ టీకాలు కూడా స్పీడ్‌గా
విదేశీ టీకాల సేకరణ కార్యక్రమం కూడా వేగవంతం అవుతుందని ప్రధాని తెలిపారు. అధికారిక అనుమతి ప్రక్రియలు, స్థానిక నిబంధనల పాటింపు వంటివి కీలకం అన్నారు. విదేశీ టీకాలకు కొన్ని సడలింపుల ద్వారా అనువైన వాతావరణం కల్పించడం జరుగుతుందని పరోక్షంగా తెలిపారు.

పిల్లలకు వైరస్ భయాలపై దృష్టి
తదుపరి వైరస్ పిల్లలను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటుందనే భయాలు ఉన్నాయని ప్రధాని అంగీకరించారు. నిపుణులు ఈ విషయంలో పలు హెచ్చరికలు చేశారని, వీటిని అధికారిక బృందాల స్థాయిలో సమగ్రంగా పరిశీలించుకుని చర్యలు చేపడుతామని వెల్లడించారు. పిల్లలకు టీకాలకు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయి. వీటికి ముందు వాటికి సంబంధించి స్క్రీనింగ్ అవసరం . పిల్లలు టీకాలను ఏ విధంగా తట్టుకుంటారనేది కీలకం అన్నారు. రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌ను పిల్లలలో చేపట్టినట్లు తెలిపారు. దేశానికి సంబంధించి ఇక్కడ తయారు అయిన రెండు వ్యాక్సిన్లు మనకు నిజంగానే బలాన్ని ఇచ్చినట్లు ఈ రెండు మేడిన్ ఇండియా టీకాలు అతి తక్కువ సమయంలో వచ్చినట్లు ఇప్పటికే 23 కోట్ల డోస్‌లు పంపిణీ అయినట్లు ప్రధాని తెలిపారు. ముక్కు ద్వారా టీకాలకు సంబంధించిన నాసల్ స్ప్రేవిషయంలో కూడా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పుడు ఇవి ఇన్‌హేలర్స్‌గా అందుబాటులోకి వచ్చినట్లు అయితే పిల్లలకు టీకాల విషయంలో మరింత పురోగతి ఏర్పడుతుందని ప్రధాని చెప్పారు.

కరోనాపై బహుముఖ పోరు
దేశంలో కరోనాపై పోరును బహుముఖ రీతిలోసాగిస్తున్నట్లు, వివిధ స్థాయిలలో యుద్ధప్రాతిపాదికన బలోపేతం చేసినట్లు ప్రధాని తెలిపారు. ఇక కేవలం టీకాలే కాకుండా అత్యవసరం అయిన ఔషధాల ఉత్పత్తిని కూడా భారీగా పెంచుతున్నట్లు ప్రధాని చెప్పారు. నిజానికి కరోనా నివారణకు సంబంధించి వ్యక్తులు తీసుకునే ముందస్తు జాగ్రత్త చర్యలు కీలకమని, వ్యాక్సిన్లు ఇతరత్రా చికిత్సల పరిధికి ముందు ప్రజల భాగస్వామ్యంతో జరిగే ప్రక్రియనే కొవిడ్ కట్టడికి దారితీస్తుందని ప్రధాని తేల్చిచెప్పారు. బహుముఖ కోణంలో కరోనాపై పోరుతో ఇప్పటికే సరికొత్త రీతిలో ఆరోగ్య చికిత్స మౌలిక నిర్మాణ వ్యవస్థ బలోపేతం అయి, అందుబాటులోకి వచ్చిందని. వైరస్ రూపాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్సను బలోపేతం చేయడం ద్వారా కరోనా తదుపరి దశను నివారించుకుని తీరుతామన్నారు.

కరోనా బాధాకరం
దేశానికి కరోనా తీవ్రస్థాయి బాధాకర పరిణామాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచం అంతటా కమ్ముకున్న వైరస్ ప్రభావాన్ని ఆదినుంచి లేకుండా చేసేందుకు జాతియావత్తూ కృషి చేసింది. ఇదో పోరుగా సాగింది. ఈ క్రమంలో దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అత్యధిక సంఖ్యలో బాధలు పడ్డారు. పలువురు ప్రాణాలు పొయ్యాయి. వారందరికి తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నానని, ఓ భయంకర పరిస్థితిపై పోరు దశలో బలి అయిన వారి కుటుంబాల బాధ శాశ్వతంగానే ఉంటుంది. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్రం ముందుకువస్తుందని తెలిపారు.

Centre to Provide free Vaccination from June 21: PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News