న్యూఢిల్లీ : ప్రసార సేవల బిల్లు కొత్త ముసాయిదా రూపకల్పనకు ముందు మరింతగా సంప్రదింపులు జరపగలమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపాదిత చట్టంలో సామాజిక, డిజిటల్ మీడియాపై ఆంక్షలు విధిస్తుండడం గురించి కొన్ని వర్గాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. కొన్ని భాగస్వామ్య వర్గాలలో ప్రభుత్వం పంపిణీ చేసిన ముసాయిదా ప్రసార సేవల బిల్లుపై డిజిపబ్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వంటి మీడియా సంస్థల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై డిజిటల్ మీడియా సంస్థలను, పౌర సమాజ సంస్థలను సంప్రదించలేదని అవి విమర్శించాయి.
‘ముసాయిదా బిల్లుపై భాగస్వామ్య వర్గాలతో మంత్రిత్వశాఖ వరుసగా సంప్రదింపులు సాగిస్తోంది. అక్టోబర్ 15 వరకు వ్యాఖ్యలు/ సూచనలు కోరేందుకు మరింత సమయంఇవ్వడమైంది’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేసింది. సమగ్ర సంప్రదింపుల అనంతరం సరికొత్త ముసాయిదా వెలువరించగలం’ అని మంత్రిత్వశాఖ తెలిపింది. ముసాయిదా ప్రసార సేవల (క్రమబద్ధీకరణ) బిల్లు రూపకల్పనకు తాము కృషి చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలియజేసింది.