Saturday, November 23, 2024

కొవిడ్ నిబంధనలకు తెర!

- Advertisement -
- Advertisement -

Centre Withdraws Covid 19 Restrictions

ఈ నెలాఖరు (మార్చి 31)తో కేంద్ర ప్రభుత్వ కొవిడ్ నిబంధనల పాలనకు తెర పడిపోతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినందున దానికి సంబంధించిన కఠిన నిబంధనలను ఎత్తివేయనున్నామని, ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించవచ్చునని, రాష్ట్రాలు తమ సొంత ప్రజారోగ్య విధానాలను అవలంబించవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ముందస్తు కబురు కాకరకాయ లేకుండానే 2020 మార్చి 25న ప్రధాని మోడీ కఠిన లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి లెక్కేసుకుంటే ఈ 25 నాటికి దేశంలో కొవిడ్ బీభత్సానికి రెండేళ్లు నిండాయి. మూడవ వేవ్‌గా వచ్చిన ఒమిక్రాన్ కూడా చెప్పుకోదగిన ప్రమాదాన్ని సృష్టించకుండానే ముగిసిపోయినందున దేశానికి ఈ ముప్పు తప్పినట్టేనని కేంద్రం భావిస్తున్నది. అందుచేతనే నిబంధనల పాటింపును నిలిపివేయవచ్చునని నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే కొవిడ్ వల్ల దేశంలోని నిరుపేదలు, పేదలు, మధ్య తరగతి ప్రజలు పడిన బాధలు, ఎదుర్కొన్న కష్టనష్టాల ఉదంతాలు కళ్ల నీళ్లు తెప్పించక మానవు. కరోనాను తిరుగులేని రీతిలో ఎదుర్కొన్నామని ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పకున్నా వాస్తవంలో దాని వైఫల్యాల చిట్టా అనంతంగా సాగిపోతున్నది. కరోనా వైరస్‌ను విజయవంతంగా అదుపు చేసిన దేశాల్లో ఇండియా ఒకటని 2021 జనవరిలో ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. కొవిడ్‌కు ఇండియా భయపడలేదని, అతి త్వరగా వ్యాపించిన ఆ మహమ్మారిని అదుపు చేయడానికి దృఢ నిర్ణయాలు తీసుకున్నదని, దేశంలో వైద్య చికిత్సా సదుపాయాలను కూడా మెరుగు పరుచుకున్నదని ప్రధాని ఘనంగా చెప్పుకున్నారు.

అయితే, ఈ రెండేళ్ల కరోనా కరాళ నృత్యం సమయంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలు చిట్టా అనంతంగా విప్పితే అది సాగిపోతుంది. ఉన్నట్టుండి విరుచుకుపడిన లాక్‌డౌన్ ఉపయోగపడకపోగా ప్రజలను అనేక బాధలకు గురి చేసింది. రవాణా సౌకర్యాలు బంద్ అయిపోయి, పనులు కోల్పోయి, అతి దూరాన వున్న సొంత వూళ్లకు వెళ్లే దారి కానక, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆరుబయళ్లలో రోజుల తరబడి అర్థాకలితో గడిపి చివరికి వందల మైళ్లు కాలి నడకన ప్రయాణం చేసిన వలస కార్మికులు పడిన కష్టాలు, దారిలోనే ప్రాణాలు కోల్పోయిన వారి హృదయ విదారక ఉదంతాలు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్నాయి. అహోరాత్రాలు పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి చప్పట్లు కొట్టాలని, వంట పాత్రల శబ్దాలు చేయాలని పిలుపిచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని మోడీ ధోరణి బాధిత జనం పట్ల క్రూర పరిహాసంగా చరిత్రలో నమోదైపోయింది. రోగులు అసంఖ్యాకంగా వస్తుంటే ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు చాలక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించగా అవి సాగించిన దోపిడీలో అమానుషత్వం గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి వంటి దానిని ప్రకటించి ప్రైవేటు రంగంలోని వైద్య చికిత్సా సదుపాయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కొవిడ్ బాధితులను ఆదుకోవలసిన బాధ్యతను కేంద్ర పాలకులు విస్మరించారు. ఆసుపత్రుల్లో తగిన చికిత్సా సదుపాయాలు కొరవడి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వల్ల దేశంలో మృతి చెందినవారు 5 లక్షలకు పైబడి వుంటారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.

కాని వాస్తవ సంఖ్య అంతకు కనీసం 3 రెట్లు అధికంగా వుండవచ్చునని పలు నివేదికలు చాటాయి. రెండవ అల కేంద్ర ప్రభుత్వ చేతకాని తనాన్ని నిలువెత్తున చూపించింది. ఆక్సిజన్ సిలిండర్లు కరువై ఊపిరాడక చనిపోయిన కొవిడ్ బాధితుల సంఖ్య విశేషంగా వుంది. దేశంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వానంగా వుందో కొవిడ్ మనకు విశదం చేసింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా టీకాలను అధిక సంఖ్యాకులకు వేయించగలిగామన్న ఒక్క అంశాన్నే చూపిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం ఆత్మ సంతృప్తి చెందుతున్నది. ప్రజలను మభ్యపెడుతున్నది. గంగా నదిలో అసంఖ్యాకంగా కొవిడ్ మృతుల శవాలు తేలిన దృశ్యాలు కేంద్ర పాలకుల వైఫల్యాన్ని ప్రపంచానికి చాటాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను గుజరాత్‌కు పిలిచి కొవిడ్ వ్యాప్తికి ప్రధాని మోడీ స్వయంగా తోడ్పడ్డారనిపించు కున్నారు. కేంద్ర ప్రభుత్వం క్రియాశూన్యత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, సోనూసూద్ వంటి ప్రైవేటు వ్యక్తులు బాధితులకు, వలస కార్మికులకు భోజన, వసతి, రవాణాది సౌకర్యాలు కల్పించి ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. ఈ చేదు వాస్తవాలను గుర్తుకు తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకొనే విధంగా వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేయవలసి వుంది.

Centre Withdraws Covid 19 Restrictions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News