Monday, December 23, 2024

ఎన్నికల సజావుగా జరిగేందుకు సిఈవో చర్యలు

- Advertisement -
- Advertisement -

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్ధితుల పర్యవేక్షణ
ప్రజల ఫిర్యాదుల కోసం 1950 కాల్ సెంటర్
చెక్‌పోస్టుల వద్ద సిసి కెమెరాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హింస, దౌర్జన్యం, కుల, మత రాజకీయ సమస్యలు, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, తప్పుడు సమాచారం, సైబర్ నేరాలు, ఓటింగ్ పట్ల నిరాసక్తత, విద్వేష ప్రసంగాలు, శీల హననం, ప్రలోభాల వంటి సవాలక్ష సవాళ్లను ఎదుర్కోంటుంది. వీటిని నియంత్రించడానికి ఒక కేంద్రీకృత సమాచార వ్యవస్థ అవసరమని భావించడం జరిగింది. దీనికి అనుగుణంగానే తెలంగాణ శాసనసభల ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో సమస్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని,  సరైన నిర్ణయాలతో తదనుగుణంగా స్పందించడానికి, ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఒక సమీకృత నియంత్రణ వ్యవస్థ- ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్’ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇది నిరంతరం పనిచేస్తుంది.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజక వర్గాలలోని మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన క్షేత్ర స్థాయి పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా వాస్తవ సమయంలో తెలుసుకుంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన బృందంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమీక్షిస్తుంటారు. అవసరమయినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తూ తగిన నిర్ణయాలను సమయానికి జారీ చేస్తుంటారు. తనిఖీలు, స్వాధీనాలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, 1950 కాల్ సెంటర్ కు అందిన ఫిర్యాదులు, అంతర్ రాష్ట్ర సరిహద్దులవద్ద తనిఖీలు, ప్రకటనలతో సహా ప్రచార, ప్రసారాల్లో జరిగే ఉల్లంఘనలు, నిఘా బృందాల సమన్వయం, సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులు, సువిధ తదితర అంశాలను దీని ద్వారా సిఇఓ బృందం వాస్తవ సమయంలో పరిశీలిస్తుంది. 18 డిస్టిలరీలు, 6 బ్రూవరీల దగ్గర పరిస్థితులను కూడా ఇది తెలుపుతూ ఉంటుంది.15 శాటిలైట్ టివీలు, 3 యూట్యూబ్ ఛానళ్ళను కూడా ఇక్కడ పరిశీలించే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్న కంట్రోల్ రూములన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఎన్నికల ప్రక్రియల్లో ఇప్పటికే అమల్లో ఉన్న లైవ్ వెబ్ కాస్టింగ్, సిసిటివి కెమెరాలు, వీడియోగ్రాఫింగ్ వంటి వాటి ఏర్పాటుకు ఇది అదనం.

ఇ.ఎం.ఎం.సి (ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్) : తనిఖీల్లో పట్టుబడిన నగదు స్వాధీనాలు, ఎంసిసి ఉల్లంఘనలు, అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను పరిశీలించడం జరుగుతుంది. 2217 ఎంసిసి ఉల్లంఘనలను, స్వాధీనాలను, టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలను ఇప్పటివరకు పరిశీలించడం జరిగింది.

1950 : ఇది టోలీ ఫ్రీ నంబరుతో పనిచేసే హెల్ప్ లైన్. ఓటరుగా పేరు నమోదు, వివరాల పరిశీలన, ఎపిక్ కార్డులవంటి సమాచారాన్ని ఇవ్వడానికి సిఇఓ కార్యాలయంలో ఇది 2011లో ఏర్పాటయింది. ఇప్పటివరకు 1886 కాల్స్ నమోదయ్యాయి. జిల్లాల్లో కూడా ఇదే నంబరుతో ఈ వ్యవస్థ పనిచేస్తున్నందువల్ల, ఏ జిల్లా నుండి వచ్చే కాల్స్ కు ఆ జిల్లానుండే స్పందిస్తుంది. ఒకవేళ ఈ నంబరుకు ఫిర్యాదు చేసినా, దానిని జాతీయ ఫిర్యాదుల పరిష్కార విభాగంలో నమోదు చేస్తారు. గత అక్టోబరు 9 నుండి ఇప్పటివరకు 694 ఫిర్యాదులు నమోదయ్యాయి. లోగడ ఒక లైను, ఒక ఉద్యోగితో మూడు షిఫ్టులు పనిచేయగా అక్టోబరు 9 నుండి దీనిని మూడు లైన్లకు పెంచారు.

ఎఫ్.ఎస్.టి (ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీమ్) : సాధారణ తనిఖీలు, ఎంసిసి ఉల్లంఘనలతోపాటూ సి-విజిల్ ఫిర్యాదుల పరిశీలనకు 385 ఎఫ్.ఎస్.టి వాహనాలు అందుబాటులో ఉంటాయి.

సి-విజిల్ యాప్ : ఎన్నికల నియమావళి/వ్యయ నిబంధనలకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా ఫొటో/ఆడియో/వీడియో ఆధారాలతో ఫిర్యాదులు పంపడానికి వీలుగా ఇది రూపుదిద్దుకుంది.ఇప్పటివరకు 4643 ఫిర్యాదులు అందాయి. వాటిలో 2858 వాస్తవాలని తేలగా వాటిని పరిష్కరించడం జరిగింది. 1767 ఫిర్యాదులను వదిలివేయడం జరిగింది.

సువిధ : నామినేషన్లను, అఫిడవిట్లను ఆన్ లైన్ లో దాఖలు చేయడానికి వీలుగా దీనిని రూపొందించడం జరిగింది. మీటింగులు, ర్యాలీలకు దీని ద్వారా అనుమతులు పొందవచ్చు. ఓటరు తన వివరాలతో పాటూ, ఎన్నికల ఫలితాలను, ఇవిఎంలు వాడే విధానాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 వరకు 119 శాసనసభ నియోజక వర్గాలనుంచి అనుమతుల కోసం 26,554 విజ్ఞాపనలు అందగా, 19114 విజ్ఞప్తులను అనుమతించడం జరిగింది. 3626 విన్నపాలను తిరస్కరించగా, 487 పరిశీలనలో ఉన్నాయి, 2230 పెండింగ్ లో ఉన్నాయి.

చెక్ పోస్టుల వద్ద సిసిటివీలు : ఈనెల 16 వరకు 437 చెక్ పోస్టులను, వాటిలో 882 కెమెరాలను ఏర్పాటు చేయగా, అన్ని జిల్లాల్లో 33 కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి.

సామాజిక మాథ్యమాల పరిశీలన : ఇవిఎంలకు, పోలింగ్ ప్రక్రియలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సామాజికమాథ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, దురుద్దేశ పూరిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి తగిన విధంగా స్పందించడం కోసం పోలీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులతో ఒక పరిశీలన బృందం పనిచేస్తున్నది. ఇప్పటివరకు ఇది అటువంటి 25 తప్పుడు కథనాలను గుర్తించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News