Sunday, December 22, 2024

త్వరలో సర్వైకల్ క్యాన్సర్ విముక్తి

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో మహిళలకు సంక్రమించే రెండో అతిసాధారణ క్యాన్సర్‌గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాపిస్తోంది. ఏటా 1.27 లక్షల కేసులు నమోదై, 80,000 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి ‘907090’ టార్గెట్ సాధించాలని నిర్దేశిస్తోంది. అంటే 15 ఏళ్లలోపు బాలికలు 90% వ్యాక్సిన్ పొందాలని, 35 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు 70% వరకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు 90% వరకు చికిత్స పొందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్షాలను సూచించింది. ప్రపంచం మొత్తం మీద 100కు పైగా దేశాలు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా, స్వదేశీపరంగా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో అందిన విజయాల స్ఫూర్తితో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ను నిర్మూలించడానికి హెచ్‌పివి వ్యాక్సిన్‌ను సార్వత్రిక టీకాల మాదిరిగా దేశం మొత్తం మీద పంపిణీ చేయాలన్న కృతనిశ్చయంతో భారత్ సిద్ధమవుతోంది. ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ సెర్వావాక్‌ను అభివృద్ధి చేయడంలో భారత్ పురోగతి సాధిస్తోంది. బయోటెక్నాలజీ విభాగంతో సమన్వయమై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఒక్కో డోసుకు రూ. 2000 ధర నిర్ణయించినప్పటికీ, ఇంకా తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు మూడు డోసులతో కలిగే రక్షణ ఒక్కడోసుతోనే లభిస్తోందని ఇటీవల కొన్ని సంఘటనల ద్వారా రుజువైనట్టు ప్రభుత్వం గుర్తించింది.ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ ఎప్పుడైతే చేపట్టడానికి ఉద్యమిస్తుందో అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ నుంచి భారత్‌కు త్వరలో విముక్తి లభిస్తుంది.

రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి మహిళలను పట్టి పీడిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించారు. ప్రైవేట్ సంస్థల్లో ఈ వ్యాక్సిన్‌ను రూ.1400 నుంచి 1500కు అమ్ముతున్నారని, వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చించి చవగ్గా రూ. 700 కే ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలను మనం కాపాడగలిగిన వారమవుతామని ఆమె ప్రధాని మోడీ సమక్షంలోనే సూచించారు. ఈ కోణంలో ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సిన్ సరఫరాకు సిద్ధమవుతోంది. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయం లో సర్వైకల్ క్యాన్సర్ సమాచారాన్ని రిజిస్టర్ చేయడానికి దేశం మొత్తం మీద యువిన్ పోర్టల్‌ను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ విధమైన ఎలక్ట్రానిక్ రిజిస్టరీ ద్వారా సకాలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద విస్తరింప చేయడానికి వీలవుతుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పివి) కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్‌గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది.

అందుకనే 15ఏళ్ల లోపుగానే ఈ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ లక్షణాలను కచ్చితంగా తెలుసుకోడానికి పాప్‌స్మియర్ అనే పరీక్ష ఉపయోగపడుతుంది. ఇందులో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఇదే విధంగా పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరిగినా, లైంగిక చర్యలో పాల్గొన్న తరువాత మెనోపాజ్ దశలోనూ బ్లీడింగ్ అవుతున్నా ఈ క్యాన్సర్ సోకిందని అంచనా వేయవచ్చు. పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ల వాపు వంటి సమస్యలున్నా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలే అని అనుమానించవచ్చు. ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, అతిగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారంపర్యంగా, ధూమపానం తదితర కారణాలతో ఈ క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంది.

స్కాట్లాండ్ నిర్వహించిన అధ్యయనంలో 19881996 మధ్యకాలంలో 1213 ఏళ్ల బాలికలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే సర్వైకల్ క్యాన్సర్ కేసులు కనిపించలేదని తేలింది. ఆస్ట్రేలియాలో 2007లో బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2035 నాటికి సర్వైకల్ క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న లక్షం పెట్టుకున్నారు. ఇదే విధంగా రువాండా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగించడంతో సత్ఫలితాలు లభించాయి. ముఖ్యంగా 2011లో ఈ వ్యాక్సినేషన్ తీసు కున్న మహిళల్లో గణనీయమైన ప్రగతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విజయవంతమైన కథనాలు వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం కల్పించడానికి దోహదం చేస్తున్నాయి. ఆగ్నేయాసియా 11 దేశాల్లో 6 దేశాలు హెచ్‌పివి వ్యాక్సినేషన్‌ను జాతీయ స్థాయిలో చేపట్టాయి. భూటాన్, ఇండోనేసియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, దేశాలు ఈ వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

స్వల్పాదాయ దేశాల్లో భూటాన్ ప్రప్రథమంగా 2010లోనే 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సినేషన్‌ను అమలులోకి తెచ్చి 95 శాతం వరకు లక్షాన్ని సాధించగలిగింది. అలాగే ఈ దేశం బాలురకు కూడా 2021లో ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించింది.ఏ వ్యాక్సినేషన్ కార్యక్రమానికైనా విజయానికి కీలకం పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యూహం. దీని వల్ల సమాజాలను సాధికారత చేయడమే కాక, వివేకవంతులను చేస్తుంది. భారత దేశంలో సిక్కిం ఈ విషయంలో తీసుకున్న చొరవ సమర్ధవంతంగా ప్రజారోగ్య ప్రణాళికలో వ్యాక్సినేషన్‌కు అవకాశం కల్పించింది. ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, బాలికలు, హెల్త్‌కేర్ వర్కర్లు, మీడియా వర్గాలకు ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు 2018లో ఈ వ్యాక్సినేషన్ శిబిరాలు నిర్వహించి 97 శాతం వరకు వ్యాక్సిన్ అందించగలిగింది.

డా. బి.రామకృష్ణ
99599 32323

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News