Thursday, January 23, 2025

భేషరతుగా ఆర్టిజన్ల సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో సమ్మె చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు తమ సమ్మెను భేషరతుగా విరమించారు. సమ్మెకు వెళ్లిన నేపథ్యంలో ట్రాన్స్‌కో, డిస్కంలలో 200 మంది ఆర్టిజన్లను యాజమాన్యం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టిజన్లు దిగి వచ్చి మలక్‌పేట ఎంఐఎం శాసన సభ్యుడు అహ్మద్ బిన్ బలాలతో కలిసి ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు, ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డిలతో చర్చలు జరిపి తమ సమ్మెను భేషరతుగా విరమించుకుంటామని, ఉద్యోగాలు తొలగిస్తూ నిర్ణయం ప్రకటించిన ఆ 200 మంది ఉద్యోగులకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఇందుకు సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు సానుకూలంగా స్పందిస్తూ ముందు మీరు విధుల్లో భేషరతుగా విధుల్లో చేరండని, విద్యుత సంస్థల్లో టెర్మినేట్ అయిన ఆ 200 మందిని వారం పది రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు ఎంఎల్‌ఏ బలాలతో పాటు సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ ( హెచ్ 52 ) యూనియన్ అధ్యక్షులు ఎస్. సాయిలు సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ఉద్యోగులు ఇంకా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము సిఎండిని కలిసి సమ్మెను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపామన్నారు.

టేర్మినేట్‌తో దిగి వచ్చిన యూనియన్లు

ట్రాన్స్ కో, డిస్కమ్ లలో సుమారుగా 200 మంది ఆర్టిజన్ల తొలగింపు ప్రకంపనలు సృష్టించింది. జెన్ కో లో వందశాతం, ట్రాన్స్ కో, స్కమ్‌లలో 80 శాతం ఆర్టిజన్ల హాజరు అయ్యారు. విద్యుత్ సంస్థలలో అత్యవసర సర్వీసుల చట్టం – ఎస్మా అమలులో ఉందని చెప్పినప్పటికీ వినకుండా 200 మంది ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొనడంతో ఆ ఆర్టిజన్లను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న బుధవారం వరకు వారికి సమయం ఇస్తామని, అయినా రాకుంటే ఇక ఇంటికే పంపిస్తామంటూ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర రావు ఆదేశాలు జారీ చేశారు. అటు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో విద్యుత్ శాఖ అధికారులు ఆర్టిజన్ల గైర్హాజరీపై ఒక కన్నేయడం, టెర్మినేట్ అంకం తెర మీదికి రావడంతో ఆర్టిజన్ ఉద్యోగులు దెబ్బకు దిగి వచ్చారు.

మరో వైపు ఆర్టిజన్ల సర్వీసు నిబంధన 34 (20) ప్రకారం ఈ సమ్మె చట్ట విరుద్దంగా (మిస్ కాండక్ట్ కింద )పరిగణించబడుతుందని ముందుగానే ఆర్టిజన్లకు యాజమాన్యం తెలియజేయడమే కాకుండా దీనికి తోడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వినియోగదారులకు అందిస్తోన్న 24 గంటల విద్యుత్ సరఫరాను భగ్నం చేసే ఏ దుశ్చర్యలనూ ఉపేక్షించబోమంటూ యాజమాన్యం హుకుం జారీ చేయడంతో చేసేది లేక వారు దిగి వచ్చారు. అయితే తాము విధుల్లో చేరుతామని, ఇప్పటి వరకు టెర్మినేట్ అయిన వారిని విధుల్లోకి తీసుకోండంటూ సిఎండికి విజ్ఞప్తి చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News