హైదరాబాద్ : విభజన హామీలను అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు తదితర నాయకులను అక్ర మంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. హన్మకొండలో వీరితోపాటు సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు సదాలక్ష్మితోపాటు వందలాది మందిని అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. గురువారం సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న పార్లమెంట్‌లో అమోదించిన వరంగల్ కోచ్‌ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా వంటివి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవని, యువతకు ఉపాధి కల్పించేవి కాబట్టి వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ప్రధాని పర్యటనను నిరసన తెలియజేస్తున్నవారిని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారని, పోలీసులు సిపిఐ నాయకులపై వ్యవహారించిన తీరును చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు.