హైదరాబాద్ : విభజన హామీలు మరిచిన బిజెపి తెలంగాణలో అధికారంలోనివస్తుందనడం విడ్డూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ళుగా విభజన హామీల అమలు చేసే పదవిలో ఉన్న అమిత్ షా వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. తాము చేయాల్సిన పనులు చేయలేదని, కొత్తగా అధికారంలోకి వచ్చి చేసేదేమిటని నిలదీశారు. సామరస్యానికి ప్రతీకైన తెలంగాణలో బిజెపి నేతలు మత విద్వేషాలు రగిలించే విధంగా ప్రసంగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్షం వ్యవహరించిందని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, భద్రాచలంలో ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపి తెలంగాణకు తీవ్ర నష్టాన్ని మిగిల్చారని వాపోయారు. నేషనల్ హైవేల ద్వారా రోడ్లను విస్తరిస్తున్నామని చెబుతున్న అమిత్ షా దానికి చేసిన ఖర్చులను టోల్ గేట్ల ద్వారా ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని, అందులో వారి ఘనత ఏముందని ప్రశ్నించారు. బిజెపి ఆరాటం తెలంగాణలో అధికారం తప్ప తెలంగాణ అభివృద్ధి పట్ల వారికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు పునరుద్దరించడం లేదని, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి, కాజీపేట రైల్వేకోచ్ , గిరిజన యూనివర్శిటీ ఇవ్వలేదని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య అసమానతలు పెంచడంలో మోడి ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు.