Monday, December 23, 2024

మోడీ కోసమే బండి ఆ వ్యాఖ్యలు చేశారు : చాడ

- Advertisement -
- Advertisement -

మోడీ దృష్టిని ఆకర్షించేందుకే…
మత విద్వేషాలు రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి : చాడ

Chada venkat reddy comments on Bandi sanjay
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, లౌకికవ్యవస్థకు తూట్లు పొడిచేలా ఉన్న ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు బండి సంజయ్‌ను లోక్‌సభకు ఎన్నుకున్నది రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకే తప్ప కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాదని విమర్శించారు.

తెలంగాణకు కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కృష్ణ, గోదావరి ప్రాజెక్టుల స్వాధీనానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదని, తాజాగా ఆదిలాబాద్ సిమెంటు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సరిచేయించే ప్రయత్నం చేయకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు శివలింగం, శవం అని బండి సంజయ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా రజాకార్ ఫైల్స్ తీసుకువస్తామంటున్న బండి సంజయ్, తెలంగాణకు కొత్తగా నిజాం రాచరిక, భూస్వామ్య, రజాకార్ వ్యతిరేక పోరాటాల గురించి వక్రీకరించే చరిత్ర పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రతి గడప నాటి త్యాగాల చరిత్ర చెబుతుందని, నిజాం వ్యతిరేక పోరాటానికి మతం రంగు పులిమే ప్రయత్నం సరైంది కాదని, ఆ పోరాటంలో తొలి అమరుడు షేక్ బందగీ అని, సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో ఒక్కరూ మగ్దూం మొహియొద్దీన్ అని, షోయబుల్లాఖాన్ తన ప్రాణాలను అర్పించాడని చాడ వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. తక్షణమే బండి సంజయ్ తన వ్యాఖ్యలన వెనక్కి తీసుకొని తెలంగాణ విభజన హామీలు అమలయ్యేలా కేంద్రంపై వత్తిడి తీసుకురావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News