మన తెలంగాణ/హైదరాబాద్: దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం తోపాటు న్యాయవ్యవస్థ, విద్యావ్యవస్థ మరియు మీడియాతో సహా అన్ని ప్రజాస్వామ్య సంస్థలను రాజ్యాంగ వ్యతిరేక శక్తులు క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. అంబేద్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగా పునాదులను దెబ్బతీస్తూ మనుస్మృతిని భర్తీ చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ , బిజెపిలు కుట్రలు పన్నుతున్నాయని, అందుకే ముందుగా ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని అయన తెలిపారు.
బిజెపి మతతత్వ మరియు తిరోగమన విధానాల వల్ల రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ దళిత బహుజనులకు కల్పించిన ఆర్థిక, సామాజిక హక్కులకు రక్షణ లేకుండా పోతుందని, మళ్ళి దళితులను పేదరికం, వివక్ష లోకి నెట్టే ప్రమాదం ఉందని అయన ఆందోళన వ్యక్తం చేసారు. భారత రత్న డాక్టర్ భీం రావు అంబేడ్కర్ 131 వ జయంతి సందర్బంగా గురువారం హైదరాబాద్ లిబర్టీ నుండి సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్దనున్న అంబెడ్కర్ విగ్రహం వరకు ‘ రాజ్యాంగ పరిరక్షణ‘ ప్రద ర్శనను నిర్వహించింది. చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ప్రేమ్ పావని, ఎస్. ఛాయాదేవి తదితరులు అంబెడ్కర్ విగ్రహానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.