హైదరాబాద్: ఆదివాసి ఇష్ట దైవం సమ్మక్క సారక్కలను కించపరిచే రీతిలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. కాకతీయ రాజులకు వ్యతిరేకంగా గిరిజన, ఆదివాసీల పక్షాన నిలబడిన వీర నారిమణులు సమ్మక్క సారక్కలని గిరిజనులు నమ్ముతున్నారని, వారి మనోభావాలను దెబ్బతీయడం తగదని అన్నారు. చినజీయర్ విశ్వసించే రామానుజాచార్యులు, బుద్ధుడు, మహావీరజైనుడు కూడా మానవమాతృలేనని వారు ఏమి దేవ లోకం నుండి రాలేదన్నారు.
గతంలో కూడా మాంసహారులను ఉద్దేశించి ఏ మాంసం తింటే అదే లక్షణాలు వుంటాయని వివాదాస్పదన ప్రవచనాలు చేశారని గుర్తు చేశారు. భారతదేశం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వం కలిగి వున్నదని, ప్రకృతి ఒక శక్తిగా నడుపుతున్నదని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. చినజీయర్ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సమ్మక్క సారళక్క జాతరకు కోట్లాది ప్రజలు వస్తారని, అక్కడ బెల్లమే బంగారంగా ఇవ్వడం గిరిజనుల నమ్మకమని అన్నారు. వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చినజీయర్ స్వామి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో సమాజాన్ని విడదీసే వ్యాఖ్యలను చేయకుండా వుండాలని చాడ హితవు పలికారు.