Monday, December 23, 2024

ఫ్యూచర్ సిటీకి ఫాక్స్‌కాన్ భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌కు ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్‌లియూ అన్నారు. త్వరలోనే తన బృందం తో కలిసి హైదరాబాద్‌ను సందర్శిస్తానని ఆయన తెలిపారు. తన రాకకన్నా ముందు తమ చీఫ్ క్యాం పస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భా రత దేశ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం హై దరాబాద్ వస్తుందని ఆయన తెలిపారు. ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సి టీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ అభినందించారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది.

అనుకూల వివరించిన సిఎం
హైదరాబాద్‌కు ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫా క్స్‌కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ము ఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లుగా ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

ఫోర్త్ సిటీ బహుముఖంగా అభివృద్ధి
ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎలక్ట్రానిక్స్-, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని సిఎం వారితో తెలిపారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. నవతరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్‌లో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రను చైర్మన్‌గా, మరో పారిశ్రామిక వేత్త శ్రీనివాస రాజును వైస్ చైర్మన్‌గా నియమించామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు.
ఫాక్స్‌కాన్‌కు అన్ని అనుమతులు అందిస్తాం
ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్ధతు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎం రేవంత్‌లు ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూకి వివరించారు.
కాగా, రాష్ట్రంలో దాదాపు 400 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడితో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఓఎస్‌ఏటీ)ను నెలకొల్పడానికి ఫాక్స్‌కాన్ ప్రయత్నిస్తోంది. ఈభేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి (ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎక్సటర్నల్ ఎంగేజ్‌మెంట్), ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబిజి జిఎం జొ వూ, చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సిఎస్‌బిజీ డిప్యూటీ జీఎం సూ, షొ కూ, సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీతో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీ
ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ శుక్రవారం భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టర్ యంగ్ లియూని కలవడం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచంలో సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్‌పై చర్చించినట్లు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్ సంస్థ భారత్‌లో ఆపిల్ ఐఫోన్‌ల కాంట్రాక్ట్ తయారీదారిగా ఉంది. అయితే కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తి పరిధిని విస్తరించే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News