Wednesday, January 22, 2025

చిటికెన వ్యాస కిరణాలు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. స్త్రీల సమస్యలు, మాదకద్రవ్యాలు, ప్రపంచ శాంతి, కాలుష్యం, అంతర్జాల అంతర్మధనాలు కరోనా బాధితులు, యుద్ధాలు… ఇలా ఎన్నో వెతలు మన కళ్ళముందు కదలాడుతున్నాయి. వీటన్నింటిని డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు అద్దంలో ప్రతిబింబంలా ఎంతో అందంగా అక్షరీకరించారు. అక్షరీకరించడమే కాదు వాటికి చక్కని పరిష్కార మార్గాలను కూడా ‘చైతన్య స్ఫూర్తి‘ వ్యాస సంపుటి ద్వారా ఎలుగెత్తి చాటారు. ఇలా వీరు సమాజాన్ని కాచివడపోసి ఆ వడపోతని తన రచనల ద్వారా మరింత మెరుగులు దిద్దారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారు మొదట కథకుడిగా పరిచయమయ్యారు.

ఆ తర్వాత కవిగా, వ్యాసకర్తగా, సమీక్షకుడిగా, ఎడిటోరియల్ కాలమిస్టుగా ఇలా వివిధ అంశాలపై 500 పైగా రచనలు చేసి హ్యాట్రిక్ సాధించారు. సమకాలీన సామాజిక అంశాలపై అక్షర సేద్యం చేస్తున్న సాహితీ సేవకులు వీరు. స్త్రీ విజయం, ఆత్మవిశ్వాసం, సామాజిక స్పృహ, స్త్రీ విద్య, పర్యావరణ సమతుల్యత, సమాజంలో రచయితల పాత్ర, యువతకు మేలుకొలుపు.. ఇలా సరికొత్త అంశాలని తన రచనల్లో ఆయుధాలుగా చేసుకుని రామబాణంలా సంధించి సమాజాన్ని మేలుకొలుపు తున్నారు.

‘చైతన్య స్ఫూర్తి చిటికెన వ్యాసాలు‘ అంటూ తన వ్యాస సంపుటిలో ‘వనిత నీకు వందనం‘ అంటూ స్త్రీ మూర్తిలోని మానవతా పరిమళాలు వెలికితీసి వందనాలర్పించారు. స్త్రీని దేవతామూర్తితో పోల్చి చక్కని భాష్యం చెప్పారు. స్త్రీ పుట్టింటి నుండి అత్తవారింటికి అడుగు పెడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కూడా సహనంగా ఉంటుందని చెప్పారు కిరణ్ కుమార్ గారు. సమాజంలో ఎంతోమంది స్త్రీలు వివక్షకు గురవుతున్న తీరుతెన్నుల్ని ఎంతో ఆవేదనగా చెప్పారు. ఈ రోజుకు కూడా స్త్రీలు బయటకు వెళ్ళి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి వాటి పరిష్కారానికి చట్టాల్లో పెను మార్పులు తేవాలని చక్కని సూచనలు చేశారు. అలాగే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే ఇద్దర్ని రెండు కళ్ళలా చూడాలని రచయిత చెప్పకనే చెప్పారు.

‘మన భారతదేశమే గొప్ప‘ అనే వ్యాసంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై చక్కటి మెసేజ్ ఇచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలచే ప్రభావితం చేయబడి సబ్ కా మాలిక్ ఏక్ హై అంటారు రచయిత. అలాగే భారతీయులు పెద్దల ఆచారాలు సంప్రదాయాలను గౌరవిస్తూ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని మంచి కితాబునిచ్చారు వివాహ సంప్రదాయానికి. అలాగే తెలుగు భాషకి ఉన్న ఘనతని కూడా ఎలుగెత్తి చాటారు. ఇంక మన సంప్రదాయ వంటల ఘుమఘుమలు నలుదిశలా వ్యాపించేలా చక్కగా కీర్తించారు.

‘విజయానికి సంకేతం వివేకానందుడు‘ వ్యాసంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వ ఖండాల విను వీధుల్లో ఎగరవేశారన్నారు కిరణ్ కుమార్ గారు. వివేకానందుడు పేదవారి సేవనే భగవంతుని సేవగా భావించి సేవలోనే అందరూ తనవారు అనుకుంటే భగవంతుడు ఎల్లవేళలా మన వెన్నంటే ఉంటారని వివేకానందుడి తత్వాన్ని చాలా చక్కగా అభివర్ణించారు రచయిత. ‘యువత మాదకద్రవ్యాలను విడనాడాలి‘ అనే వ్యాసంలో యువత వాటికి బలవుతున్న వైనాన్ని అవి ఎంత ప్రమాదకరమో ఇంకా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్న తీరుతెన్నుల్ని ఎంతో ఆవేదనగా చెప్పారు. అలాగే నేటి యువత మాఫియా మత్తులో పడి అకృత్యాలు చేస్తూ జీవితాల్ని పెడత్రోవ పడుతున్న వైనాన్ని యువతకి తెలిసేలా చక్కగా వివరించారు.

ఈ ఉచ్చులో నుంచి బయట పడాలంటే అందరూ నడుం బిగించి యువతని మంచి మార్గంలో పయనించేలా చక్కని కౌన్సిలింగ్ ఇప్పిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చాలా చక్కగా చెప్పారు కిరణ్ కుమార్ గారు
ఐక్యరాజ్యసమితి శాంతి కోసం చేస్తున్న కార్యక్రమాలు శాంతి ఆవశ్యకతను తెలియజేస్తున్న వైనాన్ని చాలా చక్కగా అక్షరీకరించి చెప్పారు రచయిత ‘సమాజ శాంతితోనే ప్రపంచ శాంతి‘ వ్యాసంలో. శాంతి కోసం దయ, కరుణ, ధ్రుడ విశ్వాసాలను వ్యాప్తి చేయాలని ఐక్యరాజ్యసమితి చెప్పిందని రచయిత చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేటి తరుణంలో పేదల ఆకలి కేకలు, దాడులు, దౌర్జన్యాలు, ఆయుధాలు, యుద్ధాలు లేని శాంతియుత మార్గంలో అందరూ ఉంటే ప్రపంచశాంతి విశ్వవ్యాపితంగా పరిఢవిల్లుతుందని శాంతి కపోతాన్ని తన రచన ద్వారా ఎగరవేశారు కిరణ్ కుమార్ గారు. ‘స్త్రీ విద్య దేశానికి ప్రామాణికం‘ వ్యాసంలో విద్య అందునా స్త్రీ విద్య దేశప్రగతికి, కుటుంబ ప్రగతికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చాలా చక్కగా చెప్తారు.

స్త్రీలు శాస్త్రసాంకేతిక రంగాల్లో మంచి పట్టు సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకు వెడుతుందని యువతని మేలుకొలిపారు. స్త్రీలు విద్యావంతులైతే జ్ఞానసముపార్జన ద్వారా లభించే చక్కని సేవలో తద్వారా దేశ అభివృద్ధి, ఇంకా పిల్లల భవిష్యత్తు ఉందని స్త్రీ విద్య ప్రాముఖ్యతను ఎంతో అందంగా అక్షరీకరించి చెప్పారు.
‘కాలుష్య నియంత్రణ బాధ్యత మనది‘ అంటూ దేశం కాలుష్యం కోరల్లో చిక్కుకున్న వైనాన్ని వివరిస్తూ అందులో నుంచి బయటపడాలంటే పంచభూతాల్ని పరిరక్షించుకుంటూ మనమంతా మిగతావారిని ఎడ్యుకేట్ చేయాలని చక్కని వివరణ ఇచ్చారు రచయిత. ‘భవితకు రూపం పుస్తకం‘ అంటూ అంతర్జాల మాయాజాలం నుంచి బయట పడాలంటే పుస్తకం చదవడం లోని విశిష్టతను చక్కగా వివరించారు. పుస్తక పఠన ప్రయోజనాలు మేధావులు పుస్తక పఠనంతో ఆకాశమంత ఎత్తు ఎదిగిన వైనాన్ని చెప్తూనే మనం మన పిల్లలు కూడా పుస్తక పఠనంతో జ్ఞాన సమూపార్జనతో పాటు మన ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని పుస్తక పఠనం ఆకశ్యకతను చక్కని పదజాలంతో తెలియజేశారు.

‘ఆ…కమ్మని పలుకే అమ్మ‘ అంటూ అమ్మకు చక్కని భాష్యం చెప్పారు రచయిత ఈ వ్యాసంలో. అమ్మ అమృతాన్ని పంచి బిడ్డలని ఉన్నత స్థానంలో నిలబెట్టడుతుండుతుంది. అందుకే ‘అమ్మను మించిన దైవమున్నదా..‘ అంటున్నారు రచయిత. అలాగే వివిధ సినీ కవులు ఇచ్చిన కితాబుల్ని కూడా ఈ వ్యాసంలో పొందుపరిచి అమ్మకు శతకోటి వందనాలు అర్పించారు కిరణ్ కుమార్ గారు. ‘వ్యాయామం‘ వ్యాసంలో వ్యాయామం చేస్తే మనిషికి సంపూర్ణ ఆరోగ్యంపై ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందో చాలా చక్కగా వివరణ ఇచ్చారు రచయిత. క్రమం తప్పకుండా రోజూ ఉదయాన్నే నిద్రలేవడం క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే మనలో నిక్షిప్తమై ఉన్న బద్ధకం అనే భూతం వెంటనే పారిపోతుందని హాస్యాన్ని జోడించి చెప్పారు. అలాగే వ్యాయామం వల్ల జీవనక్రియలు చురుగ్గా పని చేస్తూ మన మానసిక స్థితి చురుగ్గా, ఉత్సాహంగా ఉరకలు వేస్తుందని చెప్పారు.

అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మనమంతా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడి మన జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలతో సంతోషంగా కొనసాగించవచ్చని చక్కని విశ్లేషణ ఇచ్చారు. చివరిగా ‘యుద్ధం అనాధల యథార్థ జీవితాలు‘ వ్యాసంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, కుటుంబ సభ్యులు అయిన వాళ్ళని కోల్పోయి పడుతున్న వేదనని, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్న వైనాన్ని ఎంతో ఆవేదనతో చెప్పారు. అలాగే అనాథగా మారిన వారి కోసం ప్రభుత్వాలు, పౌరసమాజం చేయాల్సిన విధివిధానాలను చాలా వివరంగా తెలియజేసి యుద్ధంలో సర్వం కోల్పోయిన వారికి అందే సహాయాలను కూడా తెలియజేసి ఈ అనాధలకి కొండంత అండని ఇచ్చారు రచయిత కిరణ్ కుమార్. ఇంకా ఈ ’చైతన్యస్ఫూర్తి‘ వ్యాస సంపుటిలో ‘ప్రతి గుండెను కదిలించిన రూట్స్,, బతుకమ్మ లో గౌరమ్మ,, చేనేతన్నకు పండుగ బతుకు, నేటి కాలంలో ఆత్మవిశ్వాసం పాత్ర, కరోనాతో అనుబంధాల పాత్ర, ‘మనో ధైర్యం‘తో….‘ లాంటి వ్యాసాలు ఎంతో ఆసక్తిదాయకంగా సాగిపోతూ చక్కని సందేశాన్ని ఇస్తూ ఎంతో చక్కగా అలరించే ’చైతన్య స్ఫూర్తి’ వ్యాసాలు అందరూ తప్పక చదవవలసిన పుస్తకం.

ఈ వ్యాస సంపుటి ద్వారా అందరికీ ఎంతో చైతన్యాన్ని కలిగించిన డాక్టర్ కిరణ్ కుమార్ గారు పురస్కారాల పరంపరలో భాగంగా శ్రీలంక ప్రతినిధుల చేతుల మీదుగా ‘గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డు‘, ,మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి చేతులమీదుగా ‘గిడుగురామ్మూర్తి భాషా సేవ పురస్కారం‘,వరల్ అచీవర్స్(వే ఫౌండేషన్) వారిచే.. సోషల్ అచీవర్ పురస్కారం‘, ఏ. కె. తెలుగు మీడియా వారి తెలంగాణ ‘సాహిత్య రత్నం పురస్కారాలను‘ సొంతం చేసుకుని పురస్కారాలకే వన్నె తెచ్చిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారికి అభినందనలు. చైతన్య స్ఫూర్తి వ్యాససంపుటి పుస్తక వివరాలకు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ. ఫోన్ : 9490841284.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News