మహబూబ్ నగర్: పేద వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ఆని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడారు. చాకలి ఐలమ్మ పేదల కోసం కష్టపడిందని, భూస్వాములపై దాడి చేసిందని, భూ స్వాములు ఎన్నో అవమానాలు చేసినప్పటికీ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడిందన్నారు. చాకలి ఐలమ్మ కు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు బాసటగా నిలిచారని ,పేదల ధాన్యాన్ని భూస్వాములు కల్లాలపైనే దౌర్జన్యంగా దోచుకుంటుంటే ఎదురొడ్డి నిలబడి పేదలకు న్యాయం చేసిందని అన్నారు. ఐలమ్మ రజక కులంలో జన్మించినప్పటికీ అన్ని వర్గాల వారి కోసం పోరాటం చేసిందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాగరికత నేర్పే కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఐలమ్మ స్ఫూర్తిగానే తెలంగాణ వచ్చిందని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ వస్తే సమానత్వం పెరుగుతుందని, తద్వారా మహిళలు ఉద్యోగ, విద్యా అవకాశాలతో పాటు, రాజకీయంగా ఎదుగుతారన్నారు.
రజక కులస్తుల సంక్షేమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ వాషింగ్ మిషన్ల ద్వారా బట్టలు ఉతికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రజక సంఘానికి పాతపాలమూరులో ఎకరా స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రజక ఫంక్షన్ హాల్ కు త్వరలోనే నిధులు ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. మహబూబ్నగర్ శర వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని రంగాలలో ముందుకెళుతున్నదని, పాలమూరు- రంగారెడ్డి ద్వారా సాగునీరు వస్తున్నదని,జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి కె. నరసింహ, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, ముదా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రజక సంఘం అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, కౌన్సిలర్లు గోవిందు, కట్ట రవి కిషన్ రెడ్డి, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.