లక్నో: పిక్నిక్ కు రాలేదని భార్య, అత్తను భర్త చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ ప్రాంతంలో జరిగింది. దీంతో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బులందేశ్వర్ జిల్లాకు చెందిన జోషేప్ పీటర్ అలియాస్ బదాల్(41), కామిని సింగ్(39) అనే దంపతులు చకేరి ప్రాంతంలోని ఫ్రెండ్స్ కాలనీలో నివసిస్తున్నారు. కామిని ప్రైవేటు క్యాంటీన్‌లో పని చేస్తుంది. ప్రైవేటు క్యాంటీన్‌లో ఓ వ్యక్తితో కామిని వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త పలుమార్లు అనుమానించాడు.
దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. భార్యకు పిక్నిక్ వెళ్దామని చెప్పి ఆటోను ఇంటి వద్దకు తీసుకోచ్చాడు. పిక్నిక్ రానని తెగేసి చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంలో ఊగిపోయిన భర్త పదునైన ఆయుధం తీసుకొని భార్య మెడపై కొట్టాడు. అక్కడే ఉన్న కామిని తల్లి పుష్ప అల్లుడిని ఆపడానికి ప్రయత్నించింది. ఆమె తలపై కూడా ఐరన్ రాడ్‌తో కొట్టడంతో కిందపడిపోయారు. ఇంట్లో నుంచి భయంకరమైన ఆరుపులు కేకలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి చేరుకునేసరికి ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. ఇద్దరు మృతి చెందడంతో కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.