కేరళ లోని మూడు జిల్లాలకు ప్రాణాధారమైన చలియార్ నది నిర్మల జలాలు కొండచరియలు విరిగిపడిన తరువాత ఇప్పుడు ప్రాణాంతకంగా మారాయి. 169 కిమీ పొడవున ప్రవహిస్తున్న ఈ నదీ తీరం ఒడ్డున వయనాడ్, మలప్పురం, కొజికోడ్ జిల్లాల ప్రజలు తరతరాలుగా ఈ నదీ జలాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలే నదిపై తేలియాడుతున్నాయి. స్థానికులతోపాటు నేవీ, పోలీస్, ఫైర్, ఎన్‌డిఆర్‌ఎఫ్, రిస్కూ టీమ్‌లు
శనివారం ఈ నది నుంచి మరో మూడు మృతదేహాలను, 13 అవయవ భాగాలను శనివారం వెలికి తీయగలిగారు. ఇప్పటివరకు నది నుంచి 73 మృతదేహాలను, 132 అవయవ భాగాలను సేకరించారు. మొత్తం 205 మృతదేహాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు 198 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ పూర్తయిందని వీటిలో 195 మృతదేహాలను తదుపరి కార్యక్రమాల కోసం వయనాడ్ పంపామని అధికారులు చెప్పారు. చలియార్ నది 40 కిమీ పొడవునా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మలప్పురానికి చెందిన అధికారి తెలిపారు.