- త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
- బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణరెడ్డి
కాటారం : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో రాష్ట్రంలో కొంతమంది టికెట్ దక్కని బీఆర్‌ఎస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ టికెట్ బరిలో నిలిచిన కాటారం మండలం ధన్‌వాడ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ బుధవారం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి మంథని నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నానని, కాటారం మండలం ధన్‌వాడ గ్రామం నుండి మూడు సార్లు సర్పంచ్‌గా, కాటారం సింగిల్‌విండో చైర్మన్‌గా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, జెడ్పీటీసీగా గెలిచి సేవలు అందించడం జరిగిందన్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి అప్పటి టీఆర్‌ఎస్ ఇప్పటి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి గడప గడపకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ది సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలకు వివరించడం జరిగిందన్నారు.
కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం నిర్వహించి ప్రసాదాన్ని కేసీఆర్ కుటంబ సభ్యులకు అందించానని, అదే రోజు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మంథని నియోజకవర్గం నుండి బరిలో ఉంటానని ప్రకటించడం జరిగిందని, అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు.
అప్పట్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరిష్‌రావు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాటారం పీఏసీఎస్ చైర్మన్‌గా కొనసాగుతూ మంథని నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు మరింత దగ్గరయ్యానని తెలిపారు. తీరా టికెట్ కేటాయించకపోవడంతో బీఆర్‌ఎస్ అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అనుచరలతో చర్చించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.