Thursday, January 23, 2025

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సవాల్

- Advertisement -
- Advertisement -

సుప్రీంను ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమ వారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది.ఈ ఏడాది ఆగస్టు 24న హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. మాజీ మంత్రి డికె అరుణను గద్వాల ఎంఎల్‌ఎగా హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పును బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 1వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కాపీని మాజీ మంత్రి డికె అరుణ అందించారు. అంతేకాదు ఎంఎల్‌ఎగా తనతో ప్రమాణం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గద్వాల నుండి మరోసారి పోటీ చేసేందుకు బిఆర్‌ఎస్ నాయకత్వం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టిక్కెట్టు కేటాయించింది. 2014, 2018 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. 2014లో ఆయన ఓటమి పాల య్యాడు. 2018 ఎన్నికల్లో మాజీ మంత్రి డికె అరుణపై విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు వరకు ఆయన టిడిపిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన టిడిపిని వీడి బిఆర్‌ఎస్‌లో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణల మధ్య బంధుత్వం ఉంది. అయినా కూడ వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఈ ఏడాది జూలై 25న కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావుపై కూడ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News