Friday, November 22, 2024

నేటి మహిళకు సవాళ్ళు-పరిష్కారాలు

- Advertisement -
- Advertisement -

1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15 వేల మంది మహిళలు, మహిళా హక్కుల ఉద్యమనేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్‌ను కూడా ఇందులో చేర్చారు. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈనిరసన సాగింది.ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.

1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశాడు. తర్వాత మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరోప్ మహిళలు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితంగానే 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అయితే ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్ అనే థీవ్‌ుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2024ను నిర్వహించుకుంటున్నాం.

లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది. ఈ దిశగా ప్రపంచం కొంత పురోగతి సాధించినప్పటికీ చేరుకోవాల్సిన తీరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బాల్యవివాహాలు, భారమైన ఇంటిపని, గృహ హింస, అవకాశాల్లో వివక్ష, వేతనాల్లో అసమానత, భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, నిర్ణయాధికారం లేకపోవటం వంటి అనేక సమస్యలు ఇంకా మహిళల్ని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు.దీంట్లో సగం మంది మహిళలే. సమాజంలోని ప్రతి నిర్మాణాత్మక రంగంలోనూ వారికి సగం ప్రాతినిధ్యం ఉండాల్సిందే. అది మహిళల అభ్యున్నతికి మాత్రమే కాదు, మొత్తంగా ప్రపంచం అభివృద్ధికి అత్యవసరం. కానీ, ఇది అనుకున్నంత సులభం కాదు. రాజ్యాధికారమే సకల సమస్యలను పరిష్కరించే ప్రధాన తాళం చెవి.

దానితోనే అభివృద్ధికి సంబంధించిన అన్ని తలుపులు తెరుచుకుంటాయి అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన పిలుపు దళిత, బహుజన జాతులకే కాదు మహిళలకూ వర్తిస్తుంది.విధానాలకు రూపకల్పనచేసే చట్టసభల్లో, వాటిని అమలు చేసే ప్రభుత్వాల్లో మహిళల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగినట్లు పెరుగుతున్నా అవి అమలు జరపనంత కాలం వారి భవిష్యత్తును వారు నిర్మించుకోలేరు. ఇది ఇప్పటికే నిరూపితమైంది కూడా. ఎందుకంటే పాలనలో, అధికార యంత్రాంగంలో మహిళల సంఖ్య తగినంతగా ఉన్న దేశాలు, సంస్థలే నేడు మంచి పురోభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం మన లోక్‌సభలో మహిళల వాటా 14% మాత్రమే. సరే చట్టసభల్లో మూడోవంతు సీట్లను స్త్రీలకు కేటాయించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉండి నేడు అమల్లోకి వచ్చినా దీనికి మోక్షం దక్కేలా దేశ వ్యాప్తంగా మహిళలు పూనుకోవాలి.

రాజకీయ రంగంలో పరిస్థితులు మెరుగుపడాల్సి ఉన్నప్పటికీ అంతరిక్షం నుంచి ఆరోగ్యం వరకూ అన్ని రంగాల్లో మన దేశ మహిళలు సత్తా చాటడం మంచి పరిణామం. న్యాయ, పోలీసు, రక్షణ వంటి సంప్రదాయేతర రంగాల్లోనూ వారు రాణిస్తున్నారు. అయితే స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి అంటే అక్షరాస్యత శాతాన్ని పెంచుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం -2023లో 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారత దేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారత దేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7 శాతం సాఫల్యాన్ని మాత్రమే సాధించింది. అయితే భారత దేశం లింగ సమానత్వంలో బెటర్‌గా ఉన్నప్పటికీ కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.వాటిలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది.

ఎందుకంటే ఈ విషయంలో భారత దేశం బాగా వెనుకబడిఉన్నది. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేళ్ళూనుకుపోయిన మనుధర్మ భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్‌బైజాన్, తజికిస్తాన్, బెలారస్, కిర్గిజ్‌స్థాన్‌లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు.తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికే పరిమితమవుతున్నారు. కాబట్టి స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం.

ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది ఇప్పుడు అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారత వైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. సాధికారత అంటే మరొకరి దయాదాక్షిణ్యాల మీద, అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరంలేని స్వతంత్ర వైఖరితో, ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగడం. ఇందుకు సంపుర్ణంగా హక్కుల్ని బేషరతుగా వినియోగించుకునే అవకాశం, ఏ రకమైన వివక్ష లేకుండా ఉండటం, భావజాలపరమైన అడ్డుగోడలు లేకపోవడం అనే సామాజిక వాతావరణం ఉండాలి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలకు పురుషులతో సమాన అవకాశాలు కలిగి ఉండి స్త్రీలు ఎలాంటి అడ్డంకులు లేకుండా, పురుషుల ప్రమేయం తప్పనిసరి కాకుండా తమ ప్రతిభతో, నిర్ణయ సామర్ధ్యంతో స్వావలంబన చెందడమే మహిళా సాధికారత. ఈ స్థాయిని సాధించాలంటే ఎన్నెన్నో వ్యవస్థీకతమైన అడ్డుగోడల్ని అధిగమించాల్సి ఉన్నది. కాబట్టి ఇది స్త్రీల పోరాటంగా మాత్రమే కాకుండా ఒక సామాజిక అవసరంగా, ఉద్యమంగా మొత్తం సమాజం భావించగలిగినప్పుడే మహిళా సాధికారత సాకారం కాగలదు.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News