అమ్మాయి పేరు సరస్వతి (పేరు మార్చబడింది).మంచి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాన్న సంపాదన మీదనే కుటుంబం నడవాలి. చాలా కష్టపడి చదివించాడు. ఆమె వెనుక ఇంకా ఇద్దరు ఆడకూతుర్లు వున్నారు. వాళ్ళ పెళ్లిళ్లు చేయాలి.ముగ్గురిలో ఈమె తెలివైంది. ఇక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించే సంపాదనతో వారి పెళ్లిళ్లు జరగడం కష్టం. అందుకోసమే విదేశం పోదాం అనుకుంది. కాలేజీలో అత్యధిక మార్కులతో పాసైనందుకు బ్యాంకు వాళ్లు కూడా ఆమెకు లోన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రెండు మూ డు దేశాలకు ప్రయత్నం చేసింది. ఆ దేశాల్లో కాలేజీలో అప్లికేషన్స్‌కి 20, 30 వేలు ఖర్చు పెట్టింది. కొన్ని కాలేజీల నుండి చదువుకు ఆమోదం వచ్చింది. పాస్‌పోర్ట్ అని, పోలీస్ వెరిఫికేషన్ అని, హెల్త్ చెకప్ అని ఎన్నో ఆఫీసులు తిరిగి అవసరమైన డాక్యుమెంట్స్ సమకూర్చుకుంది. విదేశాలకు పోయేందుకు ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం కాబట్టి ఆ ప్రావీణ్యాన్ని తేల్చి చెప్పే పరీక్షలు IELTS, GRE ఉన్నాయి.
వాటిలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. బ్యాంకు ద్వారా డబ్బు లు కూడా ఒక విదేశీ కాలేజీకి పంపడం జరిగింది. అక్కడి ఒక సంవత్సరం బతికేందుకు కావలసిన ఖర్చులను కూడా బ్యాంకులో వేయించుకున్నారు. ఆరు నెలలు పట్టింది. ఫీజు కట్టిన కాలేజీ వున్న దేశం నుండి వీసా రాలేదు. ఈ పంపిన డబ్బులకు వడ్డీ మాత్రం పెరుగుతుంది. మంచి మార్కులు వున్నాయి. విదేశాల్లో చదివేందుకు అవసరమైన కోర్సు ల్లో, అవసరమైన స్థాయి కన్నా ఎక్కువ మార్కులు సంపాదించింది. అయినా అదం తా వృథా అయిపోయింది. ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చాయి కానీ.అవి అతి తక్కువ జీతం ఇచ్చేవి. ఆ జీతాలతో వారికున్న బాధ్యతలు తీరడం అసంభవం. ఆమె నాన్న పదవీ విరమణకు దగ్గర్లో వున్నారు. ఈ పరిస్థితుల్లో అంతగా ఆశపడడంలో తప్ప ఏమీలేదు.
ఇంతకు ఆమె దరఖాస్తును నిరాకరించేందుకు ఇచ్చిన కారణాలు విచిత్రమైనవి. మీరు చదువుకున్న కోర్స్‌కి మీరు అప్లై చేసిన కోర్సు కి సంబంధం లేదని. మీరు ఈ దేశం వచ్చేందుకు మీరు చెప్పిన ఉద్దేశం (స్టేట్మెంట్ ఇఫ్ పర్పస్) చదువుకునేందుకని, స్థిరపడేందుకు కాదని రాసి ఇచ్చింది మేము నమ్మడం లేదు అని వీసా తిరస్కరించారు. నిజంగా అలానే రాసి ఇవ్వాలి అని ఆమె విదేశాలు కోసం ప్రయత్నం చేయడంలో సహాయపడ్డ దళారి చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ఆమె కాలేజీకి కట్టిన డబ్బు తిరిగి పంపారు. దాని మీద కట్టిన వడ్డీ వేలకు పెరిగింది. ఇక ఇప్పుడు ఆమెకు ఏంతోచలేదు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆ ప్రయత్నం ఫలించలేదు. గత్యంతరం లేక ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ పెళ్లిళ్ల గురించి, మంచి జీవితం గురించి మర్చిపోయి జీవనం గడిపేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీరి కోసం మన దేశం చేస్తున్నటువంటి సహాయం ఏంటంటే విదేశాలకు ఎలా పోవాలో తెలుపే సమాచారమున్న ఒక పుస్తకం ప్రచురించటం.
ఇలా విదేశాల చిత్రవిచిత్రమైనటువంటి విధానాలకు బలి అవుతున్న వారిని కాపాడేందుకు మాత్రం ప్రభు త్వం ఏమి చర్య తీసుకోవడం లేదు. ఉన్నత విద్యకు వారి దేశాలకు వచ్చే విద్యార్థుల విషయంలో విదేశాలు కూడా రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నాయి. కొన్ని దేశాలు చదువుకొని అక్కడ స్థిరపడేందుకు చదువుకునేప్పుడు సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తే, కొన్ని దేశాలు అలాంటి అవకాశం కల్పించడం లేదు. వారి దేశానికి విద్యార్థుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తున్నా, వారి కాలేజీలకు సంపాదన విపరీతంగా పెరిగినా, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతూ అక్కడ సాంకేతిక అభివృద్ధి కి తమ సర్వస్వాన్ని ధారపోస్తున్న ఇలాంటి విద్యార్థులను అక్కడ దేశాలు చాలా చిన్నచూపు చూస్తున్నాయి.వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. అమెరికాలో అయితే ఉద్యో గం రాక, శాశ్వత పౌరత్వం వారికి ఇవ్వకపోగా, వీసా కోసం దేశం వెళ్లేందుకు అయిన ఖర్చు తిరిగి సంపాదించేందుకు ఆ దేశంలో వుంటే వారిని దొంగల్లాగా, ఎలెక్ట్రానిక్ పర్యవేక్షణ చేసేందుకు వారి ఉనికిని నిరంతరం కనిపెట్టేందుకు వారి కాళ్లకు రేడియో ఫ్రీక్వె న్సీ డివైసెస్ కట్టి వారిని బంధించి మళ్ళీ తిరిగి ఇక్కడికి పంపించారు.
నిజానికి అభివృద్ధి చెందిన దేశాలకు పోయే అందరు విద్యార్థులు కూడా అక్కడ చదివి ఉద్యోగం చేసి ఎక్కువ సంపాదనతో హాయి గా బతకడం కాకుండా ఇక్కడ ఎన్నో త్యాగాలు చేసి వారిని చదివించిన తల్లిదండ్రులకు దోహదపడదామని ఉద్దేశంతోనే లక్షల మంది ఆ దేశాల్లో స్థిరపడ్డారు. ఒక్క అమెరికాలోనే 44 లక్షల పైచిలుకు మన దేశీయులు ఉన్నారు. అలాంటి వారి ద్వారా దేశానికి ఏటా 80 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం వస్తుంది. అసలు 1990లలో విదేశీ మారకద్రవ్యం లేకుండా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో దేశం ఉంటే ఇలాంటి విద్యార్థులు కష్టపడి చదువుకొని సొంత డబ్బులతో విదేశాలకు వెళ్లి అక్కడి నుండి విదేశీ మారక ద్రవ్యం పంపడం వల్ల మన దేశ పరిస్థితిని తట్టుకునేందుకు కొంత దోహదపడిందనేది ఆర్థికవేత్తలు ఒప్పుకున్న విషయం. అయినా ఇలాంటి విద్యార్థులతో ఆడుకునే విదేశాలకు కచ్చితంగా తెలుసు అక్కడికి వచ్చే విద్యార్థులు అక్కడికి ఎందుకు వస్తారో. అయినా దానికి సంబంధించిన సరైన విధానం ఎందుకు అవలంబించరో అర్థం కాదు.
వారి దగ్గర ఇలాంటి విద్యార్థుల గురించి కచ్చితంగా సమాచారం ఉంది. కేవలం చదువుకునేందుకే ఎంత మంది విద్యార్థులు వచ్చారు, ఎంత మంది తిరిగి పోయారు వారికి తెలుసు. తిరిగి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఎంత మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు, చదువుకొని ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం ఇవ్వగలరు అంత మందినే ఒక పద్ధతి ద్వారా ఇక్కడ మనం ఎంట్రన్స్ పెట్టి తీసుకునే లాగా ఒక శాస్త్రీయ పద్ధతులు ఎందుకు వాడరు? ఇక్కడి విద్యార్థుల సొమ్ము కావాలి గాని, వారి భవిష్యత్తు గురించి మాకేం పట్టింపులేదు అనేటటువంటి దౌర్భాగ్యపు ధోరణి గర్హనీయం. దేశంలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం 12 లక్షల మంది వరకు దేశాలకు పోతున్నారని, వారి ద్వారా విదేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు విపరీతంగా సంపాదిస్తున్నాయి అనేది నిజం. వీరి ద్వారా వేల కోట్లలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం సంపాదించే భారత దేశం ఇలాంటి విద్యార్థుల గురించి బాధ్యత వహించి,
వారికి ఇతర దేశాల ప్రభుత్వాలతో ఈ విషయంలో సంబంధాలు ఏర్పరచుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇలాంటి విద్యార్థులను అక్కడికి పంపించి వారి స్థిరపడడంలో, స్థిరపడని వారిని మళ్లీ తిరిగి ఇక్కడికి తీసుకురావడంలో, వారికి ఉద్యోగాలు ఇప్పించడంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు దేశంలో వందల కొలది ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కోటి 70 లక్షల మంది విద్యార్థులు వీరిని సంప్రదిస్తున్నారు.అందులో 12 లక్షల మందికి వీసాలు వస్తున్నాయని, మిగతా వారంతా వారి సమయాన్ని డబ్బు ను వృధా చేసుకుంటున్నారు. అసలు ఇంత ఉన్నత విద్య చదివి లక్షలు అప్పులు చేసి విదేశాలకు పోవడానికి కారణం ఇక్కడ వారికి ఉద్యోగాలు లేకపోవడం. అది కల్పించవలసిన బాధ్యత భారత ప్రభుత్వంపైన ఉంది. లక్షల కోట్లలో పెద్ద కార్పొరేట్స్‌కి రాయితీలు ఇస్తున్నప్పటికీ తగినంతగా ఉద్యోగ కల్పన లేదు. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ స్థాయి మన దేశంలో ఉంది. ఇలాంటి విద్యార్థుల బలహీనత ఆసరాగా చేసుకుని విదేశాలు ఎన్నో లాభాలు దండుకుంటున్నాయి.
పూర్వం ఈ వలసవాద దేశాలు మన దేశం నుండి ముడి పదార్థాలు తీసుకువెళ్తే ఇప్పుడు మనం ఎంతో ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ రోజుల్లో ముడిపదార్థాల కన్నా అత్యంత విలువైన మానవ వరులను కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు కెనడాలో వారి దేశస్థుల కన్నా విదేశీ విద్యార్థుల దగ్గర మూడింతలు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది నిజం. విదేశాలకు వెళ్లి ఎంతో కష్టపడి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని తల్లిదండ్రులకు డబ్బులు పంపడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ ఈ విద్యార్థులు అభివృద్ధి చెందిన దేశాలలో, తల్లిదండ్రులకు పంపించిన డబ్బు అత్యంత స్వల్పం. ఈ విదేశాలకు వెళ్లే విద్యార్థులు అత్యంత ధైర్యవంతులు, తెలివి కలవాళ్ళు. ఇలాంటి వారిని ఉపయోగించుకొని మన దేశ సంపద పెంచాలి. ఊరికే మన జాతీయ స్థూల దేశీయోత్పత్తి రెండింతలు చేద్దాం, మూడింతలు చేద్దాం అంటే అది ఎలా సాధ్యం. అవి పెంచే ఉన్నత మానవ వనరులని వదులుకుంటూ! ప్రభుత్వం ఇలాంటి విద్యార్థుల గురించి కొన్ని చర్యలు ముఖ్యంగా విపత్కర పరిస్థితులలో చేపడుతున్నప్పటికీ ఒక శాశ్వత పద్ధతిలో శాస్త్రీయ విధానాన్ని ఏర్పరిచి వీరికి సంపూర్ణ సహకారాలు అందించాలి.