న్యూఢిల్లీ : 2023 చట్టం కింద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసిల) నియామకాలను సవాల్ చేస్తున్న పిటిషన్లను ఈ నెల 19న విచారిస్తామని సుప్రీం కోర్టు బుధవారం ప్రకటించింది. ఈ లోగా ఏమైనా సంభవిస్తే పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ పిటిషన్లను బుధవారం విచారిస్తామని ఇంతకుముందు ప్రకటించారని, కానీ వాటిని 19న విచారణ జాబితాలో చేర్చారని ఎన్‌జిఒ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) తరఫున హాజరవుతున్న న్యాయవాదిప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్య కాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనంతో చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ 18న రిటైర్ కానున్నారని, తాము సవాల్ చేసిన 2023 చట్టం కింద కొత్త సిఇసిని ప్రభుత్వం నియమించవచ్చునని, కనుక ఈ కేసును అత్యవసరంగా విచారించవలసి ఉందని ప్రశాంత్ భూషణ్ వాదించారు.‘మేము ఈ కేసు విచారణను 19కి నిర్ధారిస్తున్నాం. ఈలోగా ఏమైనా సంభవిస్తే పరిణామాలు తప్పవు’ అని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ కాంత్ అస్వస్థతతో ఉన్నందున కేసుల విచారణను 19న నిర్ధారిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రీ తమకు తెలియజేసిందని ఎన్‌జిఒ తరఫున హాజరవుతున్న ప్రశాంత్ భూషణ్ చెప్పారు.ఇక అన్ని వ్యవహారాలను 19న విచారణకు చేపడతామని జస్టిస్ కాంత్ తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 3న ఈ కేసు విచారణను బుధవారానికి (12కు) నిర్ణయిస్తూ యోగ్యత ప్రాతిపదికను అంతిమంగా కేసును తేలుస్తామని స్పష్టం చేసింది.
ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)తో కూడిన స్వతంత్ర కమిటీ ద్వారా నియామకానికి ఇసిలను ఎంపిక చేయవలసి ఉంటుందని 2023 నాటి తీర్పు స్పష్టం చేసిందని భూషణ్ అంతకుముందు చెప్పారు. ‘వారు ఒక చట్టం తెచ్చారు. దాని కింద ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, మరొక మంత్రిని తీసుకువచ్చారు, ఆ విధంగా కమిషనర్ల నియామకం ప్రభుత్వం సంతుష్టి మేరకే జరుగుతుందన్న మాట. ఎన్నికల కమిషనర్ల నియామకానికి స్వతంత్ర కమిటీ ఉండడం అవసరం’ అని భూషణ్ బెంచ్‌తో చెప్పారు. 2023 మార్చి 2 నాటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారమే సిఇసి నియామకం జరపాలని కేంద్రాన్ని ఆదేశించవలసిందని కోరుతూ తాము ఒక అర్జీ దాఖలు చేశామని పిటిషనర్ కాంగ్రెస్‌కు చెందిన జయ ఠాకూర్ తరఫున హాజరవుతున్న న్యాయవాది వరుణ్ ఠాకూర్ అంతకుముందు బెంచ్‌కు తెలిపారు.