Thursday, December 26, 2024

11న ఛలో హైదరాబాద్ పిలుపు

- Advertisement -
- Advertisement -

టెట్ వేసి టీచర్ పోస్టులు పెంచాలని …
జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : డిఎస్‌సితో పాటు టెట్ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఛలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు నిచ్చారు. ఆ రోజు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిరుద్యోగ జాక్ చైర్మన్ నీలం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ డిఎస్‌సితో పాటు టెట్ నిర్వహించడం సాంప్రదాయం అని, గతంలో మన రాష్ట్రం ప్రతిసారీ డిఎస్‌సితో పాటు టెట్ నిర్వహించారన్నారు.

పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌లలోనూ డిఎస్‌సితో పాటు టెట్ వేశారన్నారు. టెట్ పాస్ కాకుండా టీచర్ పోస్టు రాయడానికి అర్హత రాదని, టెట్ వేయడానికీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమీ లేవన్నారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ టెట్ , డిఎస్‌సి నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటి అని ప్రశ్నించారు. టెట్ పాస్ కాకపోతే డిఎస్‌సికి అర్హత లేని విషయం తెలిసి కూడా పాలుకులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. టెట్ నిర్వహించి ఆరు నెలలు గడిచిందని, గత టెట్ పరీక్షలో కేవలం 10 శాతం మంది మాత్రమే పాసయి..మరో 90 శాతం మంది ఫెయిలయ్యారన్నారు. బిఎడ్, డిఎడ్ పాసైన వారు 7 లక్షల మంది ఉన్నారన్నారు. కానీ వారిలో టెట్ పాస్ అయిన వారు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. అటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని, బిఎడ్ చేసిన వాళ్ళు 4లక్షలకు పైగా ఉన్నారన్నారు. కానీ పోస్టులు చాలా తక్కువగా 2200 మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నారు. 75 శాతం ప్రమోషన్ల ద్వారా ఇవ్వరాదని దీనిని 25 శాతంకు తగ్గించి మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద భర్తీ చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎందుకంటే బిఎడ్ వారికి ఎస్‌జిటి పోస్టులకు అర్హత లేకుండా చేశారన్నారు. బిఎడ్ వారికి మిగిలినవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తప్ప మిగతా పోస్టులకు అర్హత లేదని, బిఎడ్ చేసిన వారికి చాలా అన్యాయం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టుల భర్తీకే డిఎస్‌సి ప్రకటించారని, కానీ 24వేలకు పైగా టీచరు పోస్టులు ఉన్నాయన్నారు. టీచర్ పోస్టులు సంఖ్య కూడా తక్కువగా వేశారని ఆ సంఖ్య విషయంలో అధికారులు ఆధారపడకుండా నిరుద్యోగుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిపి చర్చలు జరపాలని కోరారు. ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని ఖాళీలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేస్తారు. 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం కాదు.. డిఎస్‌సి టీచర్ పోస్టులు 24వేలకు పెంచి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పిఆర్‌సి కమిటీ రిపోర్టులో పేర్కొందని, 24 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవని ఉపాధ్యాయ సంఘాలు తెలుపుతున్నాయన్నారు. అలాగే 10వేలమంది సెకండరీ గ్రేడ్ టీచర్ల స్కూల్ టీచర్లకు అసిస్టెంట్ ప్రమోషన్లు ఇస్తే ఇంకో 10వేల పోస్టులు వస్తాయన్నారు. గత 10 సంవత్సరాల కాలం నుంచి దాదాపు 6వేలకు పైగా పాఠశాలలు మూసివేశారని, వీటిలోని టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇప్పుడు కూడా 22 వేల స్పెషల్ టీచర్లు నియమించడానికి
5 నెలల క్రితం ఆర్థిక శాఖ ఆమోదించిందని, టీచర్ పోస్టులు ఖాళీగా లేకపోతే ఈ స్పెషల్ టీచర్లు ఎందుకు నియమిస్తారో తెలపాలన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 16 వేల పాఠశాలలో ఇంగ్లీష్, మథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేరని, విద్యార్థులుకు ఈ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువులల్లో వెనుకబడి పోతున్నారన్నారు. ఇప్పటికైనా టీచర్ పోస్టులు ఖాళీల విషయంలో విద్యాశాఖ అధికారులు సరిగ్గా లెక్కించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News