Friday, November 22, 2024

చలో మేడిగడ్డ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన తొలి రోజు మేడిగడ్డకు…విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు.. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం

వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం

క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు : మాజీ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి 1న బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మేడిగడ్డ వెళ్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స మగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని చెప్పారు. మార్చి 1న ఉదయం 8.30 గంటలకు పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని చెప్పారు. మొదటి రోజు మేడిగడ్డ వెళ్తామని, ఆ తర్వాత తెలంగాణ కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీ గా తెలంగాణ ప్రజలకు మరోసారి ఆవిష్కృతం చేస్తూ.. వాళ్ల మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు అని, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో అందరికీ వివరించి ముందుకెళ్తామని అన్నారు. తెలంగాణ భవన్ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కౌశిక్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ గత కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై కాగ్ నివేదికలు, పత్రికలలో ప్రచురితమైన కథనాలను చూపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం వల్ల పాతాళగంగ పైకి వచ్చింది
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ గర్జించిందని కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో వందల కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తున్నా గతంలో ఎడారిగా ఉండేదని తెలిపారు. తలాపున మారుతుంది గోదావరి మన చేను, సేలక ఎడారి అని కవులు అప్పట్లో పాటలు రాశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ గతంలో జలయజ్ఞం చేపట్టిందని, కానీ అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని కెటిఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలతో వాగులు, చెరువులు నింపామని కెటిఆర్ చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరి గి చెరువులు నిండాయని తెలిపారు. కాళేశ్వరం వల్ల పాతాళగంగం పైకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించిందని, వర్షాలు బాగా పడ్డాయని ఒకాయన.. బోర్‌వెల్స్ పెరిగాయని ఒకాయన అం టున్నారని పేర్కొన్నారు. భూగర్భజలాలు పెరుగకపోతే కొత్త బోర్లు వేస్తరా..? అని ప్రశ్నించారు. భూగర్భ జలాలు పెరిగినయ్.. చెరువులు నిండినయ్… వాగులు నిండినయ్ కాబట్టే ఇవాళ ఈ జలవిజయాలు అని, ఇదంతా కాళేశ్వరం పుణ్యమే అని పేర్కొన్నారు. ఇది కాళేశ్వరం కింద ఉండే బరాజ్లు, రిజర్వాయర్లు నిండిన ఫలితం.. భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం అని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు ఎత్తిపోతలే శరణ్యం..
ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోసుకుంటే తప్ప మన బీళ్లకు నీళ్లు రావు.. ఇది వాస్తవం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు అని, నీళ్లు కావాలంటే ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. తెలంగాణ టోఫోగ్రఫీకి తెలిసిన వారికి ఈ విషయం తెలుస్తుందని చెప్పా రు. తెలంగాణ దాదాపు ఒక గుడిసెలా ఉంటుందని చెప్పారు. మన భౌగోళిక పరిస్థితి అలా ఉంది అని, అందుకే ఎంత ఖర్చయినా సరే.. ఎత్తిపోతలే శరణ్యం తప్ప.. తెలంగాణకు వేరే మార్గం లేదని చెప్పారు. గల్ఫ్ దేశాలను తీసుకుంటే.. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈలో తాగునీరు లేదు అని, ఆయా దేశాలలో ఉన్న సముద్రం నీళ్లను డిసాలినేషన్ చేస్తాసి మంచినీళ్లు తాగుతారని ఉదహరించారు. ఎంత ఖర్చయినా మంచినీళ్లు తాగాల్సిందే తప్పా.. వేరే మార్గం లేదు కదా..? అని ప్రశ్నించారు. వయోబులిటీ లేదు.. కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డిసాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అని వ్యాఖ్యానించా రు. తెలంగాణకు నీళ్లు కావాలంటే ఎత్తిపోయాల్సిందేనని కెటిఆర్ అన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం వల్ల నీళ్లు కావాలంటే ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోయాల్సిందేనని స్పష్టం చేశారు. పబ్లిక్ యుటిలిటీ.. లక్షల, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల గురించి కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం
దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు రప్పించేందుకు చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం అని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తెలంగాణను కరువు నుంచి గట్టెక్కించే కామధేనువు అని, తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రాజెక్ట్ అని చెప్పారు. కెసిఆర్‌కు మంచి పేరొస్తే.. తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కెసిఆర్ ప్రజల గుండెల్లో మిగిలిపోతారని, ఈ ప్రాజెక్టు ఆపేందుకు ఎన్నో కేసులు వేశారని గుర్తు చేశారు. ఎన్నో కేసులు వేసినా వాటిని అధిగమించి 400పైగా అనుమతులు సాధిం చి.. గోదావరి గంగను మన పొలాల్లో ఒప్పొంగేలా చేసింది కెసిఆర్ అని పునరుద్ఘాంటించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరాబాదరగా ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును పెట్టారని గుర్తు చేశారు. ప్రాణహిత, తుమ్మిడిహట్టి నుంచి హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని నమ్మబలికి ఆనాడు ప్రాజెక్టు డిజైన్ చేశారని అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం నిపుణుల, సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువచ్చామని తెలిపారు.
గోదావరిలో మన వాటా సాధించుకున్నాం
రూ.90 వేల కోట్లు పెట్టి 90 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు. రూ.3 వేల కోట్ల బరాజ్‌లో 84 పిల్లర్లు ఉంటే.. మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజ్ కొట్టుకుపోయిందన్నంట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు అని, అన్నింటికీ మించి 40 లక్షలకుపై చీలుకు ఎకరాలకు నీర్చి కామధేనువు అని వ్యాఖ్యానించారు. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్రమట్టం మీద 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగను పైకి ఏటికి ఎదురీదుతూపైకి తీసుకొని పోయే బృహత్తర కార్యక్రమం కాళేశ్వరమని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కట్టిన 11 ఏళ్లకు 25 వేల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే నాగార్జున సాగర్ కట్టిన 12 సంవత్సరాల తర్వాత 98 వేల ఎకరాలకు నీరు వచ్చిందని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టులో 30 సంవత్సరాల తర్వాత 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని తెలిపారు. ఇవాళ కాళేశ్వరంలో మల్లన్న సాగర్‌లో 50 టిఎంసిలు, కొండపోచమ్మ సాగర్‌లో 15 టిఎంసిలు.. ఈ రెండింటితోనే రెండు పంటలు పంటలు కలుపుకుంటే.. 13లక్షల ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉందని వివరించారు. తాము రిజర్వాయర్లు కట్టామని, ప్రస్తుత ప్రభు త్వం ప్రవాహ కాలువ, డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వొచ్చు అని పేర్కొన్నారు. కాళేశ్వరం వల్ల గోదావరిలో మన వాటా సాధించుకున్నామని చెప్పారు. కాళేశ్వరం కట్టి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని లిఫ్ట్ చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టు నిర్మించామన్నారు. తుమ్మడిహట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పిందని, నీటి కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించిందని వివరించారు. వ్యాప్కోస్ సర్వే, ఇంజనీరింగ్ నిపుణులతో సంప్రదింపుల తర్వాతే కాళేశ్వరం నిర్మించామని తెలిపారు.
మహారాష్ట్రతో వివాదం ఉన్నా పరిష్కరించుకున్నాం
కాళేశ్వరం నిర్మించడం కోసం మహారాష్ట్రతో వివాదం ఉన్నా సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. బీళ్లుగా మారిన తెలంగాణ పొలాలు.. దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు.. తెలంగాణలో రైతులకు జరిగిన అన్యాయం..వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. ఎంత ఖర్చయినా సరే ఎత్తిపోతలే శరణ్యమని భావించి తమ ప్రభుత్వం నిపుణులతో సలహాలు, సూచనల మేరకు ఎత్తిపోతల పథకాలు చేసుకున్నామని కెటిఆర్ చెప్పారు. దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేనితో విలువ కడుతారు..? అని ప్రశ్నించారు. మూషంపల్లిలో బోర్ల రాంరెడ్డి 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వస్తారు..? కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టకూడదు అని, అందులో వయోబులిటీ కనపడదు అని చెప్పారు.అలాగే ఐఐటీలు, ఐఐఎంలు పెట్టకూడదని, వాటిలో కూడా వయోబులిటీ రాదని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల్లాగా ప్రభుత్వం లాభాలను ఆశించి పనులు చేయదని అన్నారు. ఏనుగెళ్లింది.. తోక చిక్కింది అన్నటు.. అసలు పని మేం చేశాం.. మీరు చేయాల్సింది కొసరు పని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే 20 లక్షల ఎకరాలకు నీరు వచ్చిందని చెప్పారు. స్థిరీకరణ, కొత్త ఆయకట్టు చూస్తే ఒప్పుకున్న పరిస్థితి ఉందన్నారు.
సిరిసిల్లలో ఆరు మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి…
‘కాళేశ్వరంలో భాగంగా మిడ్ మానేరు జంక్షన్‌గా మారిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయని కెటిఆర్ తెలిపారు. ఈ విషయాన్ని లాల్ బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ తెలిపిందని అన్నారు. వాటర్ కాన్జర్వేషన్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఉదాహరణగా తీసుకుని యువ ఐఎఎస్ అధికారులకు పాఠాలు చెబుతున్నారని, ఇది కాళేశ్వరం ద్వారా సాధించిన విజయమని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News