టిపిసిసి ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన చలో రాజ్ భవన్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్‌చార్జీ శ్రీమతి దీపాదాస్‌మున్షీ, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీశాయి. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ ల్యాండరింగ్, మార్కెట్ మనిపులేషన్ లాంటి అంశాల్లో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి. అలాగే మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోడీ ఇప్పటివరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటి అంశాలపై ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.