Monday, December 23, 2024

వ్యవసాయ కూలీ నుంచి సిఎం పదవి వరకు చంపై సోరెన్

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్ సెరాయ్‌కెలా= ఖర్సావన్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో తండ్రితో కలసి పొలం దున్నిన చంపై సోరెన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 1990 దశకంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం సుదీర్ఘ పోరాటం సాగించినందుకు ‘ఝార్ఖండ్ పులి’ బిరుదు అందుకున్న 67 ఏళ్ల గిరిజన నేత చంపై సోరెన్. దక్షిణ బీహార్ నుంచి 2000లో ఝార్ఖండ్ ఏర్పాటైంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) అధ్యక్షుడు శిబు సోరెన్‌కు విధేయుడైన చంపై సోరెన్ ఇడి మనీ లాండరింగ్ కేసు వల్ల రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ స్థానంలో జెఎంఎం శాసనసభా పక్షం నేతగా ఎన్నికయ్యారు. ఈ కేసులో ఇడి విచారణ, జనవరి 31 రాత్రి అరెస్టు అనంతరం ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయవలసి వచ్చింది. చంపై సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన ఏడవ నేత. శిబు సోరెన్, హేమంత్ తరువాత జెఎంఎం నుంచి మూడవ నేత చంపై సోరెన్. ‘మా తండ్రి (సైమల్ సోరెన్)తో పాటు నేను పొలాల్లో పని చేస్తుండేవాడిని& ఇప్పుడు విధి వల్ల ఈ విభిన్న పదవి వచ్చింది’ అని జెఎంఎం శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన అనంతరం చంపై సోరెన్ ఒక వార్తా సంస్థతో చెప్పారు.

ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి మెట్రిక్యులేట్ అయిన చంపై 1991లో అవిభక్త బీహార్‌లో సరాయ్‌కెల సీటుకు ఉప ఎన్నిక ద్వారా స్వతంత్ర ఎంఎల్‌ఎగాఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించారు. నాలుగు సంవత్సరాల తరువాత ఆయన జెఎంఎం టిక్కెట్‌తో పోటీ చేసి బిజెపికి చెందిన పంచు టుడును ఓడించి అదే సీటు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2000లో ఝార్ఖండ్‌లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయనను అదే నియోజకవర్గంలో బిజెపికి చెందిన అనంత్ రామ్ టుడు ఓడించారు. కాని 2005లో అదే స్థానంలో బిజెపి అభ్యర్థిని కేవలం 880 వోట్ల తేడాతో ఓడించి తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యార. చంపై సోరెన్ ఆ తరువాత 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన 2010 సెప్టెంబర్ నుంచి 2013 జనవరి వరకు అర్జున్ ముండా సారథ్యంలోని బిజెపి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హేమంత్ సోరెన్ 2019లో తన రెండవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు చంపై సోరెన్ ఆహార, పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రి అయ్యారు. చంపై సోరెన్ చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News