Saturday, January 11, 2025

పంత్ వైపే సెలెక్టర్ల మొగ్గు

- Advertisement -
- Advertisement -

రోహిత్, కోహ్లీలకు చివరి అవకాశం
ఛాంపియన్ ట్రోఫీకి జట్టు కూర్పుపై బిసిసిఐ తర్జనభర్జన

మనతెలంగాణ/ క్రీడా విభాగం: పేలవ ప్రదర్శనతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన టీమిండియా మరో సవాల్‌కు సిద్దమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టి20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలుత ఇంగ్లండ్‌తో ఐదు టి20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను టీమిండియాకు సన్నాహకంగా ఉపయోగపడనుంది.

ఈ మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకీ ఈనెల 12న సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిన జట్టునే దాదాపుగా ఛాంపియన్స్ ట్రోఫీకి కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ టోర్నీలో పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శల పాలవుతున్న సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొనసాగించాలా.. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలా? అనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. ఇక వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన షమీ పూర్తి ఫిట్‌నెస్ అందుకొని దేశవాలి క్రికెట్‌లో రాణిస్తున్నాడు. దీంతో షమీపై సెలెక్టర్లు దృష్టిసారించినట్టు సమాచారం. కెఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లో వికెట్ కీపర్‌గా ఎవరికో ఒకరికి అవకాశం దక్కనుంది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తుది జట్టులోకి తీసుకునే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది.

రోహిత్, కోహ్లీలకు చివరి పరీక్ష..

టి20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆఖరి ఛాన్స్‌గా ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌లో వారికి ఉన్న రికార్డులు, అనుభవం దృష్ట్యా ఇద్దరిపై ఎలాంటి చర్యలు ఉండవని, ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగుతారని ఇప్పటికే బోర్డు వర్గాలు తెలిపాయి.

రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనుండగా.. అతనికి జతగా జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న స్టార్ పేసర్ షమీ.. ఈ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న షమీ ఫిట్‌నెస్‌ను దగ్గర్నుంచి సమీక్షిస్తున్న బీసీసీఐ మెడికల్ టీమ్.. షమీకి క్లీన్‌చిట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే షమీ భారత జట్టులోకి రానున్నాడు.

పంత్ వైపే మొగ్గు..

వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక కెఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడించనున్నారు. రాహుల్ ఆట గొప్పగా లేకున్నా.. మరి చెత్త ప్రదర్శనైతే చేయలేదు. పంత్ కూడా వన్డేల్లో గొప్పగా రాణించింది లేదు. బీజీటీ ప్రదర్శన నేపథ్యంలో రిషభ్ పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా బ్యాటింగ్ వన్డేల్లో అంత గొప్పగా ఏం లేదు.

అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ ఫిట్‌గా లేకుంటే వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కుతుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ పేరును కూడా పరిశీలించవచ్చు. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్‌కుమార్‌రెడ్డికి కూడా వన్డే సిరీస్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతని తీసుకోవచ్చు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వనున్నారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను కొనసాగించే అవకాశం ఉంది.

భారత జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్/కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News