మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెల 16న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల ఈదురు గాలులతోపాటు వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. తేమ, పోడిగాలుల కలయిక తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. ఈ నెల 15న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ నెల16న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు , మెరుపులో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోకూడ పలు ప్రాంతాల్లో ఈ నెల 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.