సల్తోరా(ప.బెంగాల్) : ఆమె రోజూ కూలీ. రెక్కాడితేగానీ డొక్కాడదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన అపూర్వ విజయం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. బెంగాల్‌లోని సల్తోరా నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బిజెపి తరఫున బరిలోకి దిగిన చందనా బౌరి అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మండల్‌పై 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. దీంతో ప్రముఖ రాజకీయ నాయకులు ఆమె విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది సామాన్య మహిళ విజయమంటూ నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. కరెంటు సదుపాయం కూడా లేని ఒక గుడిసె, మూడు మేకలు, మూడు ఆవులు, తన పేరిట రూ.31,985, తన భర్త పేరిట రూ. 30,311. ఇవే చందన అస్తుల వివరాలు. దళిత మహిళ అయిన చందనా బౌరి ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన తన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.