షాబాద్ : రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం చందనవెళ్లిలోని సర్వే నెంబరు 190లో జరిగిన భూ సేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణల జరిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భరోసా అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందనవెళ్లి, హైతాబాద్ గ్రామాల్లో కెఎల్‌ఆర్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభర తదితరులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సర్వే పేరిట భూమి లేని వారి భూమిలేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ నిర్వాసితులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అవకతవకలతో భూ సేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారన్నారు.
దీనిపై విచారణ చేయాలని భూ నిర్వాసితులు కోరారు. వారి కోరిక మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులకు రావలసిన పరిహారం డబ్బులలతోపాటు దళారులపై విచారణ చేయించి వాస్తవాలు బయటికి తీసుకుని వస్తామన్నారు. భూ నిర్వాసితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. చందనవెళ్లి భూ నిర్వాసితుల సమస్య తన దృష్టికి వచ్చినప్పుడు గద్దర్ తప్పనిసరిగా గుర్తుకు వస్తారన్నారు. ఆయన వెంట పరిశ్రమ నిర్వాహకులు జున్న శేఖర్‌రెడ్డి, బస్వీరెడ్డి, ఈదుల నరేందర్‌రెడ్డి, భీమవరపు అనిల్ కుమార్ రెడ్డి, దుర్గాప్రసాద్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, చందనవెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.