చండీగఢ్ : లోక్‌సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో ‘ఇండియా’ కూటమి ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తరఫున మేయర్ పదవికి ఆమ్ ఆద్మీ , డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాయి. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్‌పై బీజేపీ నేత మనోజ్ సోన్కర్ మేయర్‌గా గెలుపొందారు.
సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ పోటీ పడుతుండగా, ఈ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తం 35 సీట్లున్న కౌన్సిల్‌లో బీజేపీకి 14 మంది, ఆప్‌కు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడి బలం ఉంది. అయితే 8 మంది సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి అనర్హుల్ని చేయడంతో బీజేపీ అభ్యర్థికి 15 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్, ఆప్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్‌గా బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు గెలిచిందన్నారు.
మేయర్ పదవి కోసమే బీజేపీ ఇంత దిగజారితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం బిజేపి ఇంకెంతకైనా తెగిస్తుందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ ఓటమి ప్రభావం ఆప్, కాంగ్రెస్ మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలపై పడే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ వరకు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా పశ్చిమబెంగాల్‌లో పొత్తుకు నిరాకరించింది.