చండీగఢ్ : మంగళవారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారి బ్యాలట్ పత్రాలు తారుమారు చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ ఒక వీడియో పంచుకున్నాయి. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు పడిన ఎనిమిది వోట్లను చెల్లనివిగా పేర్కొన్న తరువాత బిజెపి అభ్యర్థిని విజేతగా ప్రకటించడంతో ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆప్ ఆరోపించింది. ప్రిసైడింగ్ అధికారి అనారోగ్యం కారణంగా ఈ నెల 18న జరగవలసి ఉన్న ఎన్నికలను చండీగఢ్ పాలనా యంత్రాంగం ఫిబ్రవరి 6కు వాయిదా వేయడం గమనార్హం.
అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిన తరువాత మంగళవారం మేయర్ ఎన్నికలు నిర్వహించారు. బిజెపి ‘ప్రజాస్వామ్యం హత్యకు పట్టుదలతో ఉంది’ అని పంజాబ్ పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ఈ వీడియోను పంచుకుంటూ ఆరోపించారు. ‘ప్రిసైడింగ్ అధికారి వోట్లను తారుమారు చేయడం అనుసంధానిత వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని కూడా ఆయన ఆరోపించారు. ‘బిజెపి అవినీతి పార్టీ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం హత్యకు అది పంతం పట్టింది. భుజ బలం, ఏజెన్సీలు, డబ్బు, ఒత్తిడి వ్యూహాలు, అధికారులను వాడుకోవడం ఇలా ఎన్నిటి విషయాల్లో వారికి ఎదురే లేదు. ప్రిసైడింగ్ అధికారి వోట్లను తారుమారు చేయడం అనుసంధానిత వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది’ అని రాజా వార్రింగ్ పేర్కొన్నారు.