తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్ కల్యాణ్ మధ్య శనివారం సాయంత్రం డిన్నర్ మీట్ జరగనుంది. ఇద్దరి మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అధికార వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో దూసుకుపోతుంటే, టీడీపీ-జనసేన కూటమి ఇంకా ఆ దిశగా అడుగులు వేయకపోవడం పట్ల కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు ఈ అంశాలపై డిన్నర్ మీట్ లో దృష్టి సారించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపైనా వారు కసరత్తు చేయనున్నారు. ఇదిలాఉంటే సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామ జోగయ్య చేసిన కొన్ని సూచనలను కూడా పవన్ కల్యాణ్ డిన్నర్ మీట్ లో చంద్రబాబు వద్ద ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన 40నుంచి 60 సీట్లలో పోటీ చేయాలని, కూటమి గెలిస్తే పవన్ కల్యాణ్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని సూచిస్తూ జోగయ్య ఒక లేఖ విడుదల చేశారు.