Saturday, December 21, 2024

విప్లవ ధీరుడు ఆజాద్

- Advertisement -
- Advertisement -

 

నీలో ఉన్నది ఉప్పునీరా అయితే నీ కోసమే బతుకు. కాదు ఉడుకు రక్తం మంటావా అయితే దేశం కోసం మరణించు నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాల్ని సంఘానికి సమర్పించు. నీ గుండెకాయ పత్తి కాయ అయితే భారత మాతను మర్చిపోయి నీ సుఖమే చూసుకో ఇలా రోమాలు నిక్కబోడుచుకునేలా పలికిన వీరుడు తెల్లదొరల గుండెల్లో రైలు పరిగెత్తించిన అసమాన వీరుడు భారతదేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఆయన ఒకరు ఆయనే మహోన్నత వ్యక్తి ఆజాద్ చంద్రశేఖర్. అజాద్ ఆ పేరు వింటే చాలు తెల్లదొరలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎక్కడ ఏ విధ్వంసానికి పథకం రచించి, తమపై దాడి చేస్తాడోనని ప్రాణాలు అరచేతబెట్టుకునేవారు.

బ్రిటిష్ దాస్యశృంఖాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడం కోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను పణంగాపెట్టారు. మరెందరో వీరులు ఉరికంబమెక్కారు. అలాంటి వారిలో ముఖ్యులు భగత్ సింగ్, గురుదేవ్ సుఖదేవ్ చంద్రశేఖర్ అజాద్. అత్యంత పిన్నవయసులోనే దేశం కోసం తమ జీవితాన్నే అర్పించిన మహోన్నత వ్యక్తి మహాపురుషులు. నేడు చంద్రశేఖర్ అజాద్ 90 వ వర్ధంతి దేశం గర్వించదగ్గ ఆ మహాపురుషుల్లో చంద్రశేఖర్ అజాద్ కూడా ఒకరు. 1903 జులై 23 న అలహాబాద్‌లోని ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారామ్ కేసరి. అజాద్ తల్లి అతడిని సంస్కృతంలో పెద్ద పండితుడు కావాలని కలలు గన్నారు. అయితే చదువు అబ్బకపోవడంతో తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక తన పదమూడో ఏట ముంబయికి పారిపోయి ఓ మురికవాడలో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఇక్కడ కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించి తిరిగి ఇంటికి చేరుకుని 1921లో పాఠశాలలో చేరారు. అదే ఏడాది గాంధీ జీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని స్కూల్ ఆవరణలోనే నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. పోలీసులు చంద్రశేఖర్‌ను కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచినప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నా పేరు అజాద్, నా తండ్రి పేరు స్వాతంత్య్రం అని, మేము నివసించేది జైల్లో అంటూ పలికారు.

దీంతో న్యాయవాది 15 రోజులు జైలు, పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భగత్ సింగ్, రాజ్‌గురు, పండిత రామ్‌ప్రసాద్‌లతో కలిసి పనిచేశారు. వీరి నాయకత్వంలో ఏర్పడిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు అజాద్ ముఖ్య వ్యూహకర్తగా పని చేశారు. 1925 వరకు ఓ సాధారణ దేశభక్తుడిగా తెలిసినా అదే ఏడాది జరిగిన కకోరీ రైలు దోపిడీతో అజాద్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. 1929లో లాలాలజపతి రాయ్‌పై అకారణంగా దాడి చేసి ఆయన చావుకు కారణమైన బ్రిటిష్ అధికారి స్కాట్ హత్యకు పథకం వేశారు. అయితే పోలీస్ స్టేషన్‌ను నుంచి స్కాట్ బయటకు వచ్చే సమయంలో అతడిని చంపడానికి పథకం వేసినా అది విఫలమైంది.

ఆ సమయంలో బయటకు వచ్చిన సాండర్స్‌ను స్కాట్‌గా భావించి తుపాకితో కాల్చి చంపారు. వీటిలో కీలకంగా వ్యవహరించిన అజాద్ యువతలో దేశభక్తి రగలించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల తూటాలకు ఈ అజాద్ బయపడడంటూ చేసిన నినాదం జాతీయోద్యమ కాలంలో ప్రాచుర్యం పొందింది. అవిశ్రాంత యోధుడిగా పేరుగాంచిన అజాద్‌ను అతని సన్నిహితులు క్విక్ సిల్వర్ అని పిలుచుకునేవారు. 1931 ఫిబ్రవరి 27 ఉదయం అలహాబాద్‌లోని అల్‌ఫ్రెడ్ పార్క్‌లో సుఖదేవ్‌తో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అజాద్‌పై హఠాత్తుగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన అజాద్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో భయపడకుండా వారిని ఎదురించాడు. సుఖ్‌దేవ్ అక్కడ నుంచి తప్పించుకునే వరకు వారితో పోరాడి అజాద్ తన రివాల్వర్‌తోనే ప్రాణార్పణ చేసుకున్నాడు. భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైపోయినా విప్లవ ధీరు డు ఆజాద్ చంద్రశేఖర్. నేటి సమాజంలో ఉన్న యువతకు చంద్రశేఖర్ ఆజాద్ జీవితం ఒక ఆదర్శం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News