హైదరాబాద్: గతంలో ఐఎంజి సంస్థకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమిని కేటాయించారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. హెచ్‌సియు దగ్గర ఉన్న 800 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ సర్కార్ ఆ భూములను వెనక్కి తీసుకుందని, 19 ఏళ్లుగా భూములు వివాదంలో ఉండడంతో చెట్లు పెరిగాయని చామల స్పష్టం చేశారు. అటవీ భూములంటూ తప్పుదారి పట్టిస్తున్నారని, బిఆర్ఎస్, బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ నాయకులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చామల మండిపడ్డారు.
హెచ్సియు భూములను అమ్మవద్దని విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బిజెవైఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్సీయూ ముట్టడికి వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. యూనివర్సిటీ పరిసరాల్లోకి ఎవరినీ పోలీసులు రానివ్వడంలేదు. యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు వస్తున్న బిజెపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్సియు వద్ద భారీగా పోలీసుల మోహరించారు.