Wednesday, January 22, 2025

శాఖల కేటాయింపుపై అసంతృప్తిలో చంద్రబాబు, నితీష్

- Advertisement -
- Advertisement -

శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

ముంబై: కేంద్ర మంత్రివర్గంలో తమ ఎంపీలకు కేటాయించిన మంత్రిత్వ శాఖలతో బిజెపి మిత్రులైన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అసంతృప్తి చెందుతున్నారని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు కేటాయించిన శాఖల పట్ల జెడియు, టిడిపి అధినేతలు తీవ్ర మనస్థాపం చెందుతున్నారని అన్నారు. ఎన్‌సిపి(శరద్ పవార్) అధినేత శరద్ పవార్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని, మహారాష్ట్రలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలను గద్దె దించేవరకు శరద్ పవార్ విశ్రమించబోరని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలో రెండు అసంతృప్త ఆత్మలు ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీలకు కేటాయించిన శాఖల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ రెండు అసంతృప్త ఆత్మలను బిజెపి ముందుగా సంతృప్తి పరచాలి. శాఖల కేటాయింపు పట్ల అందరి ఆత్మలు ముఖ్యంగా ఎన్‌డిఎ పక్షాలవి అసంతృప్తి చెందుతున్నాయి అని రౌత్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారని, ఈ ప్రభుత్వాన్ని ఆయనే కూల్చివేయాలని రాజ్యసభ సభ్యుడైన రౌత్ కోరారు. కేంద్ర మంత్రివర్గంలో జెడియు ఎంపి లలన్ సింగ్‌కు పంచాయతీ రాజ్, మత్స, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలు లభించగా టిడిపికి చెందని కె రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ లభించింది. జెడిఎస్ ఎంపి హెచ్‌డి కుమారస్వామికి అత్యంత తిరస్కృత శాఖ లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు.

కుమారస్వామికి భౠరీ పరిశ్రమలు, ఉక్కు శాఖ లభించింది. బిజెపి అన్ని కీలక శాఖలను తన వద్దనే ఉంచుకుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ క్యాబినెట్‌లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరని, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని రౌత్ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య చీలిక ఉండాలన్న కోరికను ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టం చేశారని, ముస్లింలు బిజెపికి ఓటు వేయలేదని భావించిన కారణంగానే వారికి తన క్యాబినెట్‌లో చోటు కల్పించలేదని రౌత్ ఆరోపించారు. ఏక్‌నాథ్ సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనలో ప్రాణం లేదని, శివసేన(యుబిటి), ఎన్‌సిపి(శరద్ పవార్) పార్టీలను బలహీనపరచాలన్న దురుద్దేశంతోనే ఈ పార్టీలు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News