అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక్కటే నని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వంలో మూడు రాజధానుల డ్రామా ఉండదన్నారు. ప్రమాణస్వీకారానికి ఒక్క రోజు ముందుగానే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు టిడిపి, బిజెపి, జనసేన శాసనసభ్యుల ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ మా ప్రభుత్వంలో మూడు రాజధానులు ఉండవు, ఒకే ఒక్క రాజధానిగా అమరావతి ఉంటుంది’’ అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా(2014-2019) చంద్రబాబు నాయుడు నాడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయాక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయన ప్రణాళికను తల్లకిందులు చేశారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఇప్పుడు మళ్లీ చంద్ర బాబు నాయుడు అధికారంలోకి రానుండడంతో అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రకటించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డిఏ కూటమి 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది.