Tuesday, December 24, 2024

హైదరాబాద్‌లో ఐటి విప్లవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 20 ఏళ్ల క్రితం నాటి హైదరాబాద్… ప్రస్తుత హైదరాబాద్‌ను పోల్చుకుంటే ఊహకందని మార్పు ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటి, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఐఎస్‌బి హైదరాబాద్ ద్విదశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఐఎస్‌బి ఏర్పాటు చేసేందుకు… అప్పటి టిడిపి ప్రభుత్వం చేసిన కృషిని మరోసారి గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటి రంగం అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారో వెల్లడించారు. “మహతీర్ మహమ్మద్ విజన్ 2020 గురించి చెప్పారని…ఇందుకు ప్రమత్‌రాజ్ సహాయం తీసుకోమని మహతీర్ సూచించారన్నారు.

ఆయన సలహా మేరకు విజన్…2020 అప్పట్లో రూపొందించామని చంద్రబాబు పేర్కొన్నారు. తాను విజన్ 2020 అన్నప్పుడు కొందరు 420 అని ఎగతాళి చేశారన్నారు. కానీ నేడు ఆ కల సాకారమైందన్నారు. విజన్ 2020తో ప్రారంభించిన వ్యవస్థలు ఇప్పుడు ఉజ్వలంగా ఉన్నాయన్నారు. 11 ఏళ్ల క్రితం నాటిన చెట్టులా ఐఎస్‌బి కూడా వృద్ధి చెందిందన్నారు. 20ఏళ్ల క్రితం ఇక్కడ సెంట్రల్ వర్సిటీ ఒక్కటే ఉండేదన్నారు. అమెరికా వెళ్లి అనేకమంది అగ్రశ్రేణి ఐటి కంపెనీల సిఇఒలను కలిశామన్నారు. మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని అప్పట్లో బతిమాలుకున్నామన్నారు. 10 నిమిషాలు అపాయింట్‌మెంట్ కోరి 45 నిమిషాల పాటు ఆయనకు వివరించామన్నారు. భారతీయులు గణితంలో స్వతహాగా ప్రతిభావంతులన్నారు. గణితం, ఇంగ్లీష్ కలిస్తేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని…. ఇదే విషయం బిల్‌గేట్స్‌కు చెప్పానని చంద్రబాబు వివరించారు.

ఒక్క మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే దానివెనుక అనేక సంస్థలు వస్తాయని అప్పటి ఆలోచన అన్నారు. అనేక సంస్థలు చెన్నై, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వచ్చాకే హైదరాబాద్‌ను ఎంచుకున్నారన్నారు. మిగతా రాష్ట్రాలు ఇచ్చే రాయితీల కంటే అదనంగా ఇస్తామని చెప్పామన్నారు. ఇంతగా శ్రమించాక హైదరాబాద్‌లో ఐఎస్‌బి పెట్టాలన్న కల సాకారమైందన్నారు. మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైదరాబాద్‌లో ఐటి విప్లవం ఊపందుకుందన్నారు. ఐటి, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని చంద్రబాబు అన్నారు. బయోటెక్నాలజీలో జీనోమ్ వ్యాలీ కొత్త విప్లవం సృష్టించిందన్నారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలోనే పనులు సమకూరుతాయనే సూత్రం తాను నమ్మానని అన్నారు. 162 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ హైదరాబాద్‌కు ఒక మణిహారమన్నారు. ఓఆర్‌ఆర్ పక్కన వచ్చిన పచ్చదనం హైదరాబాద్‌కు గ్రీన్‌సిటీ అవార్డు తెచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News