Sunday, September 8, 2024

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -
ఈ నెల 15కు విచారణ వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఎపి హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, ఈ నెల 15కు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదనపు ఎజి హాజరు కాలేకపోతున్నట్లు సిఐడి ప్రత్యేక పిపి వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మరింత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.

తొలుత విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పిపి అభ్యర్థించగా, తోసి పుచ్చిన న్యాయస్థానం 15కి వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు, అసైన్డ్ భూముల స్కాంలో సిఐడి పిటిషన్‌పైనా విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారించాలని సిఐడి ఉన్నత న్యాయ స్థానంలో పిల్ వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ నెల 22కు విచారణ వాయిదా వేసింది.

క్వాష్ పిటిషన్ పై తీర్పు అప్పుడే
ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. పాత ఆర్డర్ ప్రకారం పండుగ సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని తెలిపింది. తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు ‘సుప్రీం’ను ఆశ్రయించారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు కోర్టుకు దీపావళి సెలవులు. 19న ఆదివారం కాగా, 20న కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ వారంలో స్కిల్ కేసు తీర్పు వెలువడే అవకాశముందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

అటు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 30కి వాయిదావేసింది. అంతవరకూ చంద్ర బాబును అరెస్ట్ చెయ్యొద్దని సిఐడిని ఆదేశించింది. సెక్షన్ 17ఎ నిబంధన ఫైబర్ నెట్‌ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తా మని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే, కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా వేయాలని తొలుత ధర్మాసనం నిర్ణయించగా, సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున సగం విచారించిన జాబితా కిందకు తీసుకుంటున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఎసిబి కోర్టులో సిఐడి పిటి వారెంట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొంటూ చంద్రబాబుపై అభియోగం మోపింది. టెండర్లు లేకుండానే టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారంటూ 2021లో ఫైబర్ నెట్ కేసు నమోదు చేసిన సిఐడి మొత్తం 19 మందిపై అభి యోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌ను ఎసిబి, హైకోర్టులో కొట్టివేయగా ఆయన ‘సుప్రీం’ను ఆశ్రయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News