నా భార్యను కించపరిచేలా దూషించారు, మళ్లీ సిఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టను :
ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గురువారం జరిగిన బిఎసి సమావేశంలో సీఎం జగన్ కూడా అవహేళనగా మాట్లాడారన్నారు. ‘నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని, ఏనాడూ ఇంత బాధ భరించలేదని, బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించామన్నారు. కానీ నా భార్య భువనేశ్వరిని కించపరిచేలా దూషించారని, ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. నా భార్యను కించపరిచేలా నిండు సభలో వ్యాఖ్యలు చేశారని, ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారన్నారు. ఆమె త్యాగం, నా పోరాటం ప్రజలకు తెలుసని, మీ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడితే ఎంత బాధపడతారో గుర్తుంచుకోవాలన్నారు. రెండున్నరేళ్లుగా మమ్మల్ని బండ బూతులు తిట్టడంతో పాటు మా పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు.
గతంలో నా తల్లిని అవమానించారు
నేడు నా భార్య భువనేశ్వరిని వైఎస్ జగన్ అవమానించిన విధంగానే గతంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారని, ఆనాడు వైఎస్ తన తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణలు చెప్పారన్నారు. కానీ నేడు వైఎస్ జగన్ తనను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలని, తాను మాట్లాడుతుండగానే ఆయన నా మైక్ కట్ చేశారన్నారు. అవతలివారు బూతులు తిడుతున్నా సంయమనం పాటిస్తున్నానని, నాకు బూతులు రాక కాదన్నారు.
సిఎం అయ్యేదాక అసెంబ్లీలో అడుగుపెట్టను
ఇక క్షేత్రస్థాయిలో తేల్చుకుని మళ్లీ సిఎం అయ్యాకే తాను రాష్ట్ర అసెంబ్లీకి వస్తానని, ఈ ధర్మపోరాటంలో ప్రజలు తమ వంతు సహకరించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. గత ఎన్నికల్లో మాకు 23, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 151 స్థానాల్లో ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని, నేనేం తప్పు చేశానో ప్రజలకే తెలియాలన్నారు. శాసనసభలో మైక్ ఇవ్వకుండా అవమానించారని ఆవేదక వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో తిరిగగి సిఎం అయ్యేవరకు అసెంబ్లీలో మాత్ర అడుగు పెట్టనని తేల్చిచెప్పారు.
‘అనంత’లో పురుగుమందు తాగిన కార్యకర్తలు
శాసనసభ సమావేశాల్లో టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు శుక్రవారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదర్ వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు.
ఎన్‌టిఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత
నగరంలోని ఎన్‌టిఆర్ భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎపి సిఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు, తెలుగు యువత కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్‌లో ఎపి సిఎం జగన్, ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.