తెలంగాణ: టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తీవ్ర ఎలర్జీ, ఇతర అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడంతో బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.
హెల్త్ చెకప్ ల కోసం చంద్రబాబు నేరుగా ఏఐజీకి వెళ్లారు. ఏఐజీ ఆస్పత్రి ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబును డిశ్చార్జి చేయనుంది. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. క్యాటరాక్ట్ సమస్యకు చంద్రబాబుకు వైద్యులు సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్షలను సూచించినట్లు సమాచారం. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయం, కిడ్నీల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ తదితర పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే.