Wednesday, January 22, 2025

బాబుకు జైలే

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు విజయవాడ ఎసిబి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సిఐడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి బెంచ్ మీదికి వచ్చిన తర్వాత కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించారు. 30 మంది మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత తీర్పును చదివారు. సిఐడి తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. కేసులో చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ సెక్షన్ కు నాన్ బెయిలబుల్ వర్తిస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఆధారాలున్నాయని న్యాయమూర్తి అన్నారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు సోమవారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. జ్యూడిషియల్ రిమాండ్‌ను హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకు వెళ్తున్న తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే. దాదాపుగా ఆదివారం రెండు గంటల ప్రాంతంలో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు కోసం దాదాపు సాయంత్రం 7 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత తుది ఫలితం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. చంద్రబాబు ఎంపి కేశినేని నానితో మాట్లాడడం కనిపించింది. ఆయన తన తరఫు న్యాయమూర్తులతో కూడా మాట్లాడారు. జ్యూడిషియల్ రిమాండును హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.

అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఎసిబి కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలువినిపిస్తున్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగాయి. చంద్రబాబు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిఐడి కోరగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా వాదించారు. సుదీర్ఘంగా సాగిన వాదనలు ముగిశాయి. దీంతో ఏసీబీ న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టును సిఐడి ఆదివారం ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపింది. ఆయనను విచారించేందుకు 15 రోజుల కస్టడీకి అనుమతించాలని సిఐడి కోర్టును కోరింది.
కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు
చంద్రబాబు కేసులో తీర్పు వెలువడనున్న సమయంలో ఎసిబి కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నారు. తీర్పు వెలువడిన అనంతరం చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు పోలీసులు. టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా ఎసిబి కోర్టు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జిల్లాల్లో టిడిపి నేతలు, శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

సెక్షన్ 409 అంటే ఏమిటి
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం ఎవరైనా, ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే, లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే, జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించబడే వివరణతో కూడిన జైలుశిక్ష విధిస్తారు. ఇదే విషయంపై జరిమానా కూడా విధిస్తారు. సాధారణ వివరణ ప్రకారం ఐపిసి 409 ప్రభుత్వోద్యోగి లేదా వారి వృత్తిలో ఆస్తిని అప్పగించిన వారు (బ్యాంకర్, వ్యాపారి, న్యాయ వాది మొదలైనవి) నిజాయతీగా ఆ నమ్మకాన్ని ఉల్లంఘిస్తే, వారికి జీవిత ఖైదు లేదా పది సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానాతో పాటుగా శిక్ష వేస్తారు.
లూద్రా వాదనలు ఇలా….
చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సీఐడీ ఆదివారం ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. అందులో ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన అనేక అంశాలను వివరించింది. చంద్రబాబు ప్రధాన ముద్దాయి గా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లను సీఐడీ ప్రస్తావించింది. ఈ రిమాండ్ రిపోర్టును అనుమతిస్తూ రిమాండ్‌కు పంపాలని సిఐడి న్యాయస్థానంను కోరింది. ఇక, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది లూధ్రా కోర్టు ముందు అనేక విషయాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితంగా లూధ్రా పేర్కొన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని గుర్తు చేసారు.

ఈ కేసులో తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎపిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారని తన వాదనల్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలుగా వివరించారు. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని వాదించారు. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని లూద్రా వాదించారు. ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, సిఐడి ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాషను గమనించాలని కోరారు.

చంద్రబాబే సూత్రధారి.. సిఐడి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఇందులో ఈ స్కామ్‌కి పాత్రధారి, సూత్రధారి అన్నీ చంద్రబాబే అని తెలిపింది.కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని రిమాండ్ రిపోర్టులో సిఐడి తెలిపింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది.  ఆ రిపోర్ట్‌లో.. చంద్రబాబును సిఐడి ఎ37గా పేర్కొన్నారు. ఈ నేరంలో ఆయనే ముఖ్యమైన కుట్రదారని వివరించారు.

2021 డిసెంబరు 9 కంటే ముందు ఈ నేరం జరిగిందని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు, 36 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఇందుకోసం.. రాష్ట్రప్రభుత్వ వాటాగా డిజైన్ టెక్ లిమిటెడ్‌కు రూ.371 కోట్లు విడుదల చేశారని ఎపి సిఐడి అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చెల్లింపులు జరిగిన మొత్తానికి వస్తు సేవలను డిజైన్ టెక్ సంస్థ అందించలేదని సీఐడి పేర్కొంది. రూ.241 కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్టు మహారాష్ట్రలోని జిఎస్‌టి ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు తెలిపింది. నకిలీ బిల్లులతో షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి.. హవాలా ద్వారా నిధులు కాజేశారని ఆరోపించింది.

అంతేకాకుండా, 2015-2019 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన డిజైన్ టెక్‌కు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని సిఐడి రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో తుది లబ్దిదారు చంద్రబాబు అని వివరించింది. గతంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు (పిఎ) పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ద్వారా నిధులు స్వీకరించారని తెలిపింది. ఈ కేసులో ఎ1 సహా పలువురు నిందితులను అరెస్ట్ చేశామని సిఐడి రిపోర్ట్‌లో పేర్కొంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారన్న సిఐడి, ఇదంతా చంద్రబాబుకి తెలిసే జరిగిందని 28 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో సిఐడి చీఫ్ శనివారం చెప్పిన అంశాలనే ప్రధానంగా దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఎసిబి కోర్టు (సిటీ సివిల్ కోర్టు)లో చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరిచారు. ఎసిబి మూడో అదనపు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపరిచారు అధికారులు. జడ్జికి రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

సిట్ ఆఫీసులో చంద్రబాబును 10 గంటల పాటు విచారించిన సిఐడి అధికారులు..
అంతకుముందు… సిట్ ఆఫీసులో దాదాపు 10 గంటలు పాటూ చంద్రబాబుని సిఐడి అధికారులు ప్రశ్నించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకూ ఈ విచారణ సాగింది. మధ్యలో రాత్రి 11 గంటలకు కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబుని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, బాలకృష్ణ, బ్రాహ్మణి కలిసి మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజామున3 గంటల తర్వాత చంద్రబాబును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. దాదాపు 10 మంది డాక్టర్ల టీమ్ చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించింది. దాదాపు 45 నిమిషాలపాటూ వైద్య పరీక్షలు జరిగాయి. ఏ టెస్టులు చేసిందీ చెప్పని డాక్టర్లు, రొటీన్ టెస్టులు చేశామన్నారు.

వైద్య పరీక్షల తర్వాత ఉదయం 4.30కి చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టుకి కాకుండా సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఓ గంటపాటూ ఉంచిన అధికారులు తర్వాత ఏసీబీ కోర్టుకి తరలించారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో ఎపి సిఐడి పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సిఆర్‌పిసి సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.

కోర్టులో చంద్రబాబును కలిసి కన్నీటి పర్యంతమైన భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సమయంలో భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం విదితమే. జైలులో అన్ని సదుపాయాలు ఉన్న గదిని కేటాయించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. చంద్రబాబును జైలులో ఉంచడానికి బదులు హౌస్ అరెస్టులో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. ఇంటి భోజనం, మెడిసిన్ ఆయనకు అందుబాటులో ఉంచాలని కూడా న్యాయవాదులు కోరారు.
చంద్రబాబును అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపు ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు, అలర్ట్ అయిన పోలీసులు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎసిబి కోర్ట్ రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన చేస్తున్నాయి. ఇదిలావుండగా చంద్రబాబు రిమాండ్‌కు నిరసనగా రేపు ఎపి బంద్‌కు టిడిపి పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించింది.
జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితుల్లో ఎపిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్‌పిలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం….ఇలా!
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,350 కోట్ల ప్రాజెక్టుకు డీల్ కుదుర్చుకుంది. జర్మనీ దేశానికి చెందిన ‘సీమెన్’ అనే సంస్థ ద్వారా యువకులకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది శాతం షేర్ ను చెల్లించాల్సి ఉంది. అయితే ఎపి ప్రభుత్వం షేర్ చెల్లింపుల్లో రూ.240 కోట్లను దారి మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు నకిలీ బిల్లులు తయారు చేసి, ఇన్‌వాయిస్‌లు సృష్టించి జిఎస్‌టిని ఎగవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి.

అయితే తాజాగా ఎపి స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఎపి సిఐడికి ఫిర్యాదు అందించారు. కాగా.. గతంలోనే ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. 2021 జూలై నెలలో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సిఐడి రిపోర్టును బేస్ చేసుకొని ఆర్థిక లావాదేవీలపై ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఫొకస్ పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News