75 కేజీల కేక్‌లతో తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకలు
ఆలయాల్లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు
సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, పవన్‌కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఎపి సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, పవన్‌కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ మంత్రులు, కూటమి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు కూటమి పార్టీ నాయకులు, నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు భిన్న రూపాల్లో చంద్రబాబు పుట్టినరోజు నిర్వహించారు. 75 కేజీల భారీ కేకులు కోసి సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
ఎన్‌టిఆర్ భవన్‌లో చంద్రబాబు 75వ జన్మదినోత్సవ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లమీద ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తు టపాకాయలు కాల్చి చంద్రబాబు జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా 75 కిలోల కేక్‌ను కట్ చేశారు. టిటిడి బోర్డు సభ్యులు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ చంద్రబాబు ఒక రాజనీతజ్ఞడని, భవిష్యత్‌లో యువకులకు అవకాశం ఇచ్చి ఎన్‌టిఆర్ ఆశయాలను, చంద్రబాబు నాయకత్వంలో తెలుగువారమైన మనమందరం పని చేద్దామన్నారు.
పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నదంటే దీనిలో పెద్ద పాత్ర పోషించిన నాయకుడు మన చంద్రబాబు అన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు, అరవింద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు గురించి ఇక్కడి ప్రజలే చెబుతారని, ఆయన చేసిన అభివృద్ధే చెబుతుందన్నారు. మాజీ ఎంపీ, కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో లేకున్నా కూడా పార్టీని మోస్తున్నవారందరికీ ధన్యవాదాలన్నారు. చంద్రబాబుకి పదవులు అవసరం లేదని, ఆయన అవసరం ఏపీకి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకురాలు, నందమూరి సుహాసిని, మాజీ ఎమ్మెల్యే, కాట్రగడ్డ ప్రసూన, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కన్వీనర్, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, ఎన్‌టిఆర్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్, సీఓఓ గోపి, రాష్ట్ర పార్టీ నాయకులు నెల్లూరి దుర్గాప్రసాద్, తాళికోట హరికృష్ణ, అజ్మీరా రాజునాయక్, శ్రీనివాసా నాయుడు, సూర్యదేవర లత, మ్యాడం రామేశ్వర్‌రావు, డాక్టర్ ఏ.ఎస్.రావు, పోలంపల్లి అశోక్ కుమార్, కె. గోపి, గజేంద్ర కుమార్, వెలివెల దుర్గారావు, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, రత్నాకర్‌రావు, యాదిలాల్, కడియాల రాజేందర్, వేణుగోపాల్, పర్లపల్లి రవీందర్, జివిజి నాయుడు, మోహన్, గూడెపు రాఘవులు, మహానంది శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్‌లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పితాని సత్యనారాయణ, బతిని నరసింహ, పలకల ప్రణయ్ చంద్ర, ధనుంజయ్, అనుషా, రాధిక, సాయి బాబు, సాయి బాబ తదితరులు పాల్గొన్నారు.
తిరువణ్ణామలైలో ప్రత్యేక పూజలు : చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జైరాం చందర్ ఆధ్వర్యంలో తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుని ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు దీర్ఘాయుష్కుడిగా, సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా పోగాకు జైరాం చందర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు అని, యువతకు ప్రేరణ, భవిష్యత్తుకు దిక్సూచి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల నరేష్ ముదిరాజ్, దాసరి అవినాష్ రెడ్డి, యలమంచిలి సాయి శివకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నా మిత్రుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి చంద్రబాబు పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని ప్రధాని కొనియాడారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.
చంద్రబాబు కృషి కొనసాగాలి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. విజన్, డైనమిక్ నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.
అనితర సాధ్యుడు చంద్రబాబు : సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయడం చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని కొనియాడారు. అలాగే సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని వారు ఆకాంక్షించారు.
మంగళగిరిలో 75 కిలోల కేక్ కట్ చేసిన నేతలు : మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి మార్గదర్శి, దార్శనికుడు చంద్రబాబు అని టీడీపీ నేతలు కొనియాడారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పేరుతో రెండు సంపుటాలు ఉన్న పుస్తకాన్ని ఉప సభాపతి రఘురామ, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆవిష్కరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.