Sunday, December 22, 2024

సర్కారు ‘సంతాన’ నినాదాలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు, స్టాలిన్ ఇటీవల చేసిన తప్పుడు వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోవాలన్న కుటుంబ సంక్షేమ పథకానికి సంబంధించి సుదీర్ఘకాల జాతీయ ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు వాస్తవానికి పెద్ద కుటుంబాలను, బహు సంతానాన్ని సమర్థిస్తున్నారు. చెన్నైలోని సామూహిక వివాహ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ‘మనకు 16 మంది పిల్లలు ఉండాలని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానవంతులైతేనే అర్హులన్న నిబంధనతో చట్టం తీసుకు రావలసి ఉందని చంద్రబాబు బాహాటంగా సమర్థించడం కూడా వివాదమవుతోంది.

చంద్రబాబు ప్రకటన తరువాతనే స్టాలిన్ కూడా అదే రీతిలో బహు సంతానానికి మద్దతు పలికారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఒకవైపు అవసరాలు తీర్చవలసి ఉండగా, మరోవైపు అభివృద్ధి లక్షాలను సాధించడానికి తులనాత్మకంగా వ్యవహరించవలసిన పరిస్థితుల్లో ఆయా ప్రకటనలు ప్రారంభంలో దారుణమైన, ఇబ్బందికరమైన వాతావరణంతోపాటు ప్రాంతీయ సంకుచిత మనస్తత్వానికి దర్పణం పట్టాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టైలిటీ రేటు టిఎఫ్‌ఆర్) ను తగ్గించడానికి కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో కోరుకున్న 2.1 స్థాయి కన్నా సంతాన రేటు ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రాలు ప్రజారోగ్యం, విద్య, పోషకాహార స్థాయిల్లో తగిన వనరులను ఇంకా సమకూర్చుకోవలసి ఉంది. అప్పుడే సుస్థిర జనాభాకు తగిన సహాయం అందుతుంది.

ఇది ఈ ప్రకటనల వెనుక ఉన్న వాస్తవ ప్రేరణలకు మనలను తీసుకు వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందడానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కేంద్ర అధికార విభజనలో కానీ, నిధుల కేటాయింపులో కానీ ఉత్తరాది రాష్ట్రాలకు, వాటి జనాభా ప్రకారం ఎక్కువ సింహభాగం దక్కడం మొదటి కారణం. జనాభా గణన తరువాత నియోజక వర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు లభించే అవకాశం ఏర్పడడం రెండో కారణం. వయోవృద్ధుల జనాభా విషయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అసమతుల్యత కనిపించడం మూడో కారణం. రాజకీయంగా ఆధిపత్యం కలిగిన ఉత్తరాది గురించి ఉన్న భయాలు వెంటాడుతున్నాయి. పార్లమెంట్‌లో ఉత్తరాది ప్రాతినిధ్యం బాగా ఉన్నప్పటికీ, గత 77 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందాయి.

ఈ విషయంలో దక్షిణాది పురోగతికి సంబంధించి ఉత్తరాది వలస కార్మికులకు దక్షిణాది రాష్ట్రాలు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. వృద్ధ జనాభా పెరుగుతుండటంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందడానికి రూఢిగా సమాధానం చెప్పాలంటే ఎక్కువ మంది సంతానాన్ని పొందడంపై ఆధారపడి లేదు. ఉత్తరాది నుంచి వచ్చే వలస కార్మికులకు దక్షిణాది రాష్ట్రాలు వసతి కల్పించడం పైనే అసలు సమస్య ఆధారపడి ఉంది. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించే పనిలో 16 వ ఫైనాన్స్ కమిషన్ నిమగ్నమై ఉంది. దీని సిద్ధాంతం 2026 ఏప్రిల్ నుంచి అమలు లోకి రావచ్చు. ప్రస్తుత 15వ ఫైనాన్స్ కమిషన్ సూత్రం జనాభా పనితీరుకు సంబంధించి 12.5 శాతం వెయిటేజీ, జనాభా, ఏరియా విస్తీర్ణంపై చెరో 15 శాతం వంతున వెయిటేజీ, ఆదాయం తేడాల బట్టి 45% వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య పన్నుల నికర ఆదాయ పంపిణీ సరిగ్గా లేదన్న ఆరోపణలు గత కొంతకాలంగా వస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి దక్కుతున్నది కేవలం 2.5 శాతమే. అయినప్పటికీ జనాభా, ఏరియా, ఆదాయ వ్యత్యాసం ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు కోత విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇది వెనుకబడిన రాష్ట్రాలకు రాయితీ కానీ, ఆర్థిక నిర్వహణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు రివార్డు కానీ కాదు. 16వ ఫైనాన్స్ కమిషన్ ఈ అసమానతలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణ రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం ఇప్పట్లో పరిష్కరిస్తుందన్న ఆశ కనిపించడం లేదు. అందుకనే 2026 నాటికి రాజ్యాంగ బద్ధంగా నిర్దేశించిన నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోవడమే కాక, నిధుల కేటాయింపులో కూడా తేడాలు వచ్చే అవకాశం కలుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో విపరీత పరిణామాలకు దారి తీయకుండా నియంత్రించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News