అమరావతి: ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని రీకౌంటర్ ఇచ్చారు. రెండో రోజు ఎపి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎంఎల్ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శాసన సభలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారని, ఇవాళ 21 సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిపించిన వ్యక్తి పవన్ అని ప్రశంసించారు.
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. వైనాట్ 175 అని చెప్పి 11 తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తన జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ అని, 15వ శాసన సభను కౌరవ సభగా మనం భావించామని చంద్రబాబు ధ్వజమెత్తారు. అత్యున్నత గౌరవప్రదమైన సభగా 16వ సభను మనం తీర్చిదిద్దాలని, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని, కానీ ఈ సభ ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేస్తుందన్నారు. తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని, పివి సంస్కరణలు ఆదర్శంగా తీసుకొని అనేక పాలసీలు తీసుకొచ్చామన్నారు.