ఖమ్మం బ్యూరో : తెలంగాణలో అన్ని పార్టీల కంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఓట్లు అడిగే హక్కు, ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఖమ్మం నగరంలో సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన టిడిపి పునఃనిర్మాణ శంఖారావం సభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఖమ్మం సభను చూస్తుంటే తెలంగాణలో మళ్ళీ టిడిపికి పూర్వవైభవం చాటుకుంటుందన్నారు. తెలంగాణలో టిడిపి అవసరం ఉందని భావించేవారంతా తిరిగి పార్టీలోకి వచ్చి పూర్వవైభవాన్ని తీసుకరావాలని సభ ద్వారా పాత తమ్ముళ్ళకు పిలుపు నిచ్చారు. రాబోయే రోజుల్లో టిడిపి తిరుగులేని శక్తిగా నిలుస్తుందనే ధీమాను చంద్రదబాబు వ్యక్తం చేశారు. తెలంగాణలో టిడిపి ఇకపై బలంగానే ఉండాలని ఖమ్మం సభనుచూస్తే అనిపిస్తుందని, తెలంగాణలో టిడిపి ఎక్కడ ?అని అడిగే వాళ్ళకు ఖమ్మం సభ ద్వారా సమాధానం దొరికిందనుకుంటానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గాడితప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని, అయితే అదే సమయంలో తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసి జ్ణానేశ్వర్ లాంటి ఎంతో మంది నాయకులను తయారు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలంగాణ టిడిపికి అండగా ఉంటూ సహకరిస్తానని హామి ఇచ్చారు. తెలంగాణలో ఎంపిలు లేరు, ఎమ్మెల్యేలు లేరు.. గెలిచిన ఇద్దరూ ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు.. ఎవ్వరూ లేకపోయినా వేలాది మంది స్వచ్ఛందంగా కదిలివచ్చారని, తెలుగు తమ్ముళ్ళంతా తనకు అండగా ఉంటే నాయకులను తయారు చేయవచ్చన్నారు. టిడిపి వల్ల ఎంతో మంది బాగుపడ్డారని ప్రజాబలంతో పాటు శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకొని మళ్ళీ టిడిపిని పునఃనిర్మాణం చేద్దాం.. బలోపేతం చేద్దాం పూర్వ వైభవం తీసుకొద్దాం’ అని అన్నారు. కొంతమంది బుద్ది లేనివాళ్ళు రెండు రాష్ట్రాలను కలుపుతామని అంటున్నారని, జ్ణానం ఉన్న వారు ఎవ్వరూ అలా మాట్లాడరని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
తెలంగాణ ప్రజలు తనకు ఎంతో అవకాశం ఇచ్చారని, 9సంవత్సరాలు సిఎంగా పనిచేసే రికార్డు సృష్టించానన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.