తెలంగాణపై మళ్లీ టిడిపి దృష్టి సారించింది. వార్డు స్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను పటిష్టం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలో టిడిపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.
వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాలపై గురి పెట్టిన టిడిపి ముఖ్యంగా ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై ఫోకస్ పెట్టింది. టిడిపిని వీడి ఇతర పార్టీల్లో ఉంటున్న కొందరు నాయకులను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ ఇప్పటికే రాయబారాలను నడిపింది. ఇలా వలస వెళ్ళిన వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు మళ్లీ టిడిపిలో చేరతారనే ప్రచారం సాగుతోంది.