Wednesday, January 22, 2025

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు అభిమానుల స్వాగతం మధ్య ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న ఆయన అక్కడి నుండి సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మాజీ ఎంఎల్‌ఏలు, అభిమానులు, ఐటి ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జై బాబు..జైజై బాబు అనే నినాదాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం అంతా హోరెత్తి పోయింది. చంద్రబాబును కలిసేందుకు కార్యకర్తలు క్యాడర్ ప్రయత్నించగా జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడం కనిపించింది. కాగా ఈ సందర్భంగా దారిలో చంద్రబాబుకు పలువురు పూలు దండలు ఇవ్వగా మరి కొందరు కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు.

మరి కొందరు పార్టీ జెండాలను ఊపుతూ తమ ఆనందాన్ని పంచుకోగా మహిళలు ఎన్‌టిఆర్ బొమ్మలను చంద్రబాబుకు చూపిస్తూ బాబు తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమ్‌హారా సాథ్ హై అని నినాదాలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంఎల్‌ఏలు చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఈ క్రమంలో అటు చంద్రబాబు కూడా ఒకింత భావోగ్వేగానికి గురి అయ్యారు. టి టిడిపి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఏ బక్కని నర్సింహులు, కాట్రగడ్డ ప్రసూన తదితరులకు ఈ సందర్భంగా చంద్రబాబు ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని.. మన పార్టీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అనారోగ్యం కారణాల రీత్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.

మొన్న మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుండి విడుడలైన తర్వాత రోడ్డు మార్గంలో సుమారు 13 గంటల పాటు ఆయన ప్రయాణించి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోగా అక్కడ కూడా హైదరాబాద్ తరహాలోనే ఆయనకు భారీగా స్వాగతం తెలపటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News