అమరావతి: ఫెంగల్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని ఉన్నతాధికారులకు సూచించారు. డిజాస్టర్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ణ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫెంగల్ తుఫాను తీరాన్ని సమీపిస్తున్న సందర్భంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శనివారం మధ్యాహ్నం కల్లా పాండిచ్చేరి తీరానికి తూఫాన్ తాకవచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.